Site icon HashtagU Telugu

Wimbledon 2023: వింబుల్డన్ విజేత్ వొండ్రుసోవా

Wimbledon 2023

New Web Story Copy 2023 07 15t224322.663

Wimbledon 2023: వింబుల్డన్ అంటే టాప్ సీడెడ్ ప్లేయర్సో… యువ సంచలనాలో ఛాంపియన్లుగా నిలుస్తారు. అయితే టోర్నీలో అన్ సీడెడ్ ప్లేయర్ గా అడుగుపెట్టి టైటిల్ గెలవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్ లో అన్ సీడెడ్ ప్లేయర్ విజేతగా నిలిచింది. టోర్నీ ముందు వరకూ, ప్రారంభమైన తర్వాత కూడా ఎవ్వరికీ పెద్దగా తెలియని అన్‌సీడెడ్‌, చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్‌ మర్కెటా వొండ్రుసోవా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో ట్యునీషియా టెన్నిస్‌ స్టార్‌ ఆన్స్‌ జబర్‌ను ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకుంది.

పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వొండ్రుసోవా టైటిల్ పోరులో అదరగొట్టింది. ఆరో సీడ్ గా ఆడుతున్న జబర్‌ను నిలువరించింది. 6-4, 6-4 తేడాతో ప్రత్యర్థిపై గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో వింబుల్డన్‌ చరిత్రలో 60 ఏళ్ల తర్వాత చాంపియన్‌గా అవతరించిన తొలి అన్‌సీడెడ్‌ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఫైనల్లో ఓడిన 28 ఏళ్ల జబర్‌ గత ఏడాది వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఈ సారి తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకుందామనుకున్న జబర్ ఆశలకు వొండ్రుసోవా గండికొట్టింది. మరోవైపు ఓపెన్‌ శకంలో వింబుల్డన్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన తొలి అన్‌సీడెడ్‌ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 24 ఏళ్ల వొండ్రుసోవా ఏకంగా టైటల్ ఎగరేసుకుపోయింది. ఆమె తన కెరీర్‌లో ఆడిన రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోనే టైటిల్‌ గెలవడం విశేషం. ఈ ఏడాది జబర్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన వొండ్రుసోవా తాజాగా మరోసారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. టైటిల్ గెలిచిన వొండ్రుసోవాకు రూ.25 కోట్ల 29 లక్షలు, రన్నరప్‌ జబర్‌‌కు రూ. 12 కోట్ల 64 లక్షలు ప్రైజ్‌మనీ లభించింది.

Read More: Janasena : సోమ‌వారం తిరుప‌తి వెళ్ల‌నున్న జ‌న‌సేనాని.. సీఐ అంజుయాద‌వ్‌పై..!