Virat Kohli Injury: ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 13న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన అర్ధసెంచరీతో రాణించారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆయన ఫీల్డింగ్‌కు రాలేదు. మడమ నొప్పితో కోహ్లీ డగౌట్‌కే పరిమితం కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు కోహ్లీకి ఏమైంది? ఆయన ఫిట్‌గా ఉన్నారా లేదా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కోహ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చారు.
కోహ్లీ ఫిట్‌నెస్‌పై స్పష్టత
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ సెర్మనీలో రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ గాయం ఎంత తీవ్రంగా ఉందో ప్రస్తుతానికి పూర్తిగా తెలియదని చెప్పారు. అయితే ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదని, అందుకే ఆయనను ఫీల్డింగ్‌కు పంపలేదని వివరించారు. కోహ్లీ బాగానే ఉన్నారని పాటిదార్ పేర్కొంటూ.. ‘నాకు ఇంకా పూర్తిగా వివరాలు తెలియదు కానీ, ఆయన బాగున్నారని నేను అనుకుంటున్నాను’ అని చెప్పారు. రజత్ మాటలను బట్టి చూస్తే కోహ్లీ గాయం అంత తీవ్రమైనది కాదని, తర్వాతి మ్యాచ్ కల్లా ఆయన కోలుకుంటారని తెలుస్తోంది.
Also Read: పాకిస్థాన్ హ్యాండ్లర్లే నోయిడా హింసను ప్రేరేపించారా?
ఆర్‌సీబీ విజయంపై రజత్ ఏమన్నారు?
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 240 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై రజత్ పాటిదార్ స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఇచ్చిన అద్భుతమైన ఆరంభమే ఈ గెలుపుకు పునాది అని చెప్పారు.
“మా బ్యాటింగ్ శైలిలో స్పష్టత కనిపిస్తోంది. విరాట్ భాయ్, ఫిల్ సాల్ట్ ఇచ్చిన ఆరంభం మాకు కలిసొచ్చింది. ఆ తర్వాత నేను, మిగిలిన జట్టు ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాం. ఇది జట్టు సమిష్టి కృషి. వాంఖడే స్టేడియంలో వాతావరణం అద్భుతంగా ఉంది. నిండుగా ఉన్న స్టేడియంలో ఆడటం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది” అని రజత్ పాటిదార్ వ్యాఖ్యానించారు.
