Site icon HashtagU Telugu

Virat Kohli Record: విరాట్ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..

Virat Kohli

Virat Kohli Big Record In Ind Vs Aus Ahmedabad test

ప్రపంచ క్రికెట్ లో రికార్డుల ఎవరెస్ట్ ఎవరంటే సచిన్ టెండూల్కర్ పేరే చెబుతారు… సచిన్ తర్వాత ఆ స్థాయిలో రికార్డులకు చిరునామాగా నిలిచింది మాత్రం విరాట్ కోహ్లీనే (Virat Kohli). ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. గత మూడేళ్ళుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడినా మళ్ళీ గాడినపడ్డాడు. అయితే టెస్టుల్లో మాత్రం విరాట్ (Virat Kohli) బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ లు చూసి ఏడాది పైగా దాటిపోయింది. ఎట్టకేలకు కోహ్లీ టెస్టుల్లోనూ ఫామ్ లోకి వచ్చాడు. దాదాపు 14 నెలల తర్వాత టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ స్టార్ బ్యాటర్ మునుపటి ఫామ్ అందుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు సృష్టించాడు.

సొంతగడ్డపై టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. కోహ్లీ ఈ రికార్డును అందుకునే క్రమంలో పుజారా, వివిఎస్ లక్ష్మణ్ లను అధిగమించాడు. అహ్మదాబాద్ టెస్ట్ మూడోరోజు నాథన్ లయన్ వేసిన ఓవర్లో ఫోర్ కొట్టి కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లీ 50 మ్యాచ్ లలో 58.8 సగటుతో 4 వేలకు పైగా పరుగులు చేశాడు. అయితే యావరేజ్ విషయంలో మాత్రం కోహ్లీ , భారత క్రికెట్ దిగ్గజాలు ద్రావిడ్ , సచిన్ లను దాటేశాడు. భారత్ లో టెస్ట్ ఫార్మాట్ కు సంబంధించి అత్యధిక సగటు కలిగిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీదే టాప్ ప్లేస్. ఆ తర్వాత సెహ్వాగ్ , సచిన్, పుజారా, లక్ష్మణ్ ఉన్నారు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో 25 వేలకు పైగా పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ ఇప్పుడు సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ జాక్ కల్లిస్ ను అధిగమించేందుకు ఎదురుచూస్తున్నాడు. ఇక కోహ్లీ టెస్టుల్లో శతకం సాధించి మూడేళ్ళు దాటిపోగా… అహ్మదాబాద్ మ్యాచ్ లో తన సెంచరీ కరువు తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు.

Also Read:  Throat: ఈ చిట్కాలు పాటిస్తే గొంతు నొప్పిని దూరం చేయచ్చు..