Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకుని విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోని మూడవ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించారు. వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో కేవలం 25 పరుగులు చేయగానే ఆయన ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఈ క్రమంలో అత్యంత వేగంగా 28 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టారు.
అత్యంత వేగంగా 28,000 పరుగులు చేసిన ఆటగాళ్లు
సచిన్ టెండూల్కర్ 644 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, విరాట్ కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంటే సచిన్ కంటే 20 ఇన్నింగ్స్‌లు ముందుగానే కోహ్లీ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
- 624 ఇన్నింగ్స్‌లు – విరాట్ కోహ్లీ
- 644 ఇన్నింగ్స్‌లు – సచిన్ టెండూల్కర్
- 666 ఇన్నింగ్స్‌లు – కుమార సంగక్కర
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు
ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ రెండవ స్థానానికి చేరుకున్నారు. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (28,016 పరుగులు) రికార్డును ఆయన అధిగమించారు.
Also Read: టీమిండియాకు తొలి విజయం.. మొదటి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!
- 34,357 పరుగులు – సచిన్ టెండూల్కర్
- 28,017+ పరుగులు – విరాట్ కోహ్లీ
- 28,016 పరుగులు – కుమార సంగక్కర
విరాట్ కోహ్లీ కెరీర్ గణాంకాలు
విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన అద్భుతమైన కెరీర్ ప్రయాణం ఇలా ఉంది.
- టెస్ట్ క్రికెట్: 123 మ్యాచ్‌ల్లో 9,230 పరుగులు.
- టీ20 అంతర్జాతీయం: 125 మ్యాచ్‌ల్లో 4,188 పరుగులు.
- వన్డే క్రికెట్ (ODI): ఇప్పటివరకు 14,600 పైగా పరుగులు.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాటర్‌గా కోహ్లీ ఇప్పటికే రికార్డు సృష్టించారు. ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి సారించిన కోహ్లీ.. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
