ఐపీఎల్‌ 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం ఎంతంటే?

బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ ప్లేయింగ్ 11లో (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) ఉండే ప్రతి ఆటగాడికి ఒక్కో మ్యాచ్‌కు రూ. 7.50 లక్షల ఫీజు ఇవ్వాలి.

Published By: HashtagU Telugu Desk
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 (IPL 2026)లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. తన మెరుపు బ్యాటింగ్‌తో వైభవ్ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. గత శుక్రవారం (ఏప్రిల్ 10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) ఆటగాడు వైభవ్ కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత వైభవ్ జీతం పెరిగిందా? ఈ సీజన్‌లో ఎంత జీతం లభిస్తోంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీని రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో ప్రస్తుత 2026 సీజన్ కోసం రాజస్థాన్ అతడిని రిటైన్ చేసుకుంది. మరి ఈ సీజన్‌లో వైభవ్‌కు అంతకంటే ఎక్కువ డబ్బు అందుతోందా?

IPL 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం

గత సీజన్ మాదిరిగానే 2026 సీజన్‌లో కూడా వైభవ్‌కు రూ. 1.10 కోట్ల జీతం లభిస్తుంది. ఫ్రాంచైజీ పరంగా అతని కాంట్రాక్ట్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే బీసీసీఐ (BCCI) తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం వైభవ్‌కు ప్రతి మ్యాచ్‌కు అదనంగా రూ. 7.50 లక్షల మ్యాచ్ ఫీజు అందుతుంది.

Also Read: ట్రైన్‌నే లాగిన కారు.. ధ‌ర ఎంతో తెలుసా?

బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ ప్లేయింగ్ 11లో (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) ఉండే ప్రతి ఆటగాడికి ఒక్కో మ్యాచ్‌కు రూ. 7.50 లక్షల ఫీజు ఇవ్వాలి. ఒకవేళ వైభవ్ లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడితే మ్యాచ్ ఫీజు రూపంలోనే రూ. 90 లక్షలు లభిస్తాయి. ఈ లెక్కన చూస్తే తన కాంట్రాక్ట్ ధర (1.10 కోట్లు), మ్యాచ్ ఫీజు (90 లక్షలు) కలిపి ఈ సీజన్‌లో వైభవ్ దాదాపు రూ. 2 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. బీసీసీఐ ఈ మ్యాచ్ ఫీజు నిబంధనను 2025 సీజన్ నుండి అమలులోకి తెచ్చింది.

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ కెరీర్

వైభవ్ ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 11 ఇన్నింగ్స్‌ల్లో 41.09 సగటు, 229.44 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 452 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.

  Last Updated: 11 Apr 2026, 04:20 PM IST