USA Cricket Team at a Mumbai Pani Puri Stall : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి కొద్దీ రోజుల సమయం ఉండటంతో క్రికెట్ ప్రపంచంలో సందడి మొదలైంది. భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ కోసం అమెరికా (USA) క్రికెట్ జట్టు ఇప్పటికే ముంబైకి చేరుకుంది. ఫిబ్రవరి 7న వాంఖడే స్టేడియంలో ఆతిథ్య భారత్‌తో జరగనున్న హై-ప్రొఫైల్ మ్యాచ్‌కు ముందు, అమెరికా ఆటగాళ్లు ముంబై నగర వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. కేవలం ప్రాక్టీస్ సెషన్లకే పరిమితం కాకుండా, అక్కడి స్థానిక ఆహార రుచులను ఆస్వాదిస్తూ ముంబై కల్చర్‌లోకి పరకాయ ప్రవేశం చేశారు.
ముఖ్యంగా అమెరికా ఆటగాళ్లు ముంబై స్ట్రీట్ ఫుడ్ ఐకాన్ అయిన ‘పానీపూరీ’ ని ఆస్వాదిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరకరలాడే పూరీలను మసాలా నీటితో నింపి తింటూ, ఆ ఘాటుకు మురిసిపోతున్న ఆటగాళ్ల నవ్వులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అమెరికా జట్టులో కెప్టెన్ మోనాంక్ పటేల్, ఆల్‌రౌండర్ శుభమ్ రంజనే వంటి భారత సంతతి ఆటగాళ్లు ఉండటంతో, వారికి భారతీయ వంటకాలపై ఉన్న మక్కువను ఈ సందర్భంగా చాటుకున్నారు. ఒక పక్క టోర్నీ ఒత్తిడి ఉన్నా, ఇలాంటి సరదా క్షణాలు జట్టులో ఉత్సాహాన్ని నింపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వరల్డ్ కప్ అమెరికా జట్టుకు అత్యంత కీలకం. 2024 టోర్నీలో సూపర్-8 దశకు చేరుకుని సంచలనం సృష్టించిన ఈ జట్టు, ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. గ్రూప్-ఏలో భాగంగా ఫిబ్రవరి 7న భారత్‌తో, ఫిబ్రవరి 10న పాకిస్థాన్‌తో, ఫిబ్రవరి 13న నెదర్లాండ్స్‌తో మరియు ఫిబ్రవరి 15న నమీబియాతో అమెరికా తలపడనుంది. బలమైన టీమ్ ఇండియాతో తొలి పోరు కావడంతో, ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న ఈ “దేశీ వైబ్స్” ఆటగాళ్లకు మైదానంలో ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి.
