Site icon HashtagU Telugu

Rain In Bengaluru: చెరువులాగా మారిన చిన్న‌స్వామి స్టేడియం.. ఆర్సీబీ ప్లేయ‌ర్ ఏం చేశాడో చూడండి!

Rain In Bengaluru

Rain In Bengaluru

Rain In Bengaluru: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎం. చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా అకస్మాత్తుగా భారీ వర్షం (Rain In Bengaluru) కురిసింది. అంద‌రూ ఆర్‌సీబీ ఆటగాళ్లు తమ కిట్‌లను తీసుకుని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. కానీ ఆస్ట్రేలియన్ ఆటగాడు టిమ్ డేవిడ్ వర్షాన్ని చూసి తనను తాను ఆపుకోలేకపోయాడు. అతను మైదానం మధ్యలోకి వచ్చి పిల్లల్లాగా వర్షంలో తడవడం ప్రారంభించాడు. అతను తన దుస్తులను తీసివేసి మైదానంలో నీరు నిలిచిన చోట ఆనందంగా ఆడుకోవడం మొదలుపెట్టాడు. అతని ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

టిమ్ డేవిడ్ వర్షంలో ఆట‌లు

ఐపీఎల్ పునఃప్రారంభం అయిన తర్వాత మొదటి మ్యాచ్ శనివారం మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇక్కడ వర్షం కురుస్తోంది. ఆర్‌సీబీ ఆటగాళ్లు ఇలాంటి వాతావరణంతో అస్సలు నిరాశ చెందడం లేదు. ఎందుకంటే వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా జట్టు ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది. అయితే కోల్‌కతా ఈ రేసు నుండి బయటకు వెళ్లిపోతుంది.

టిమ్ డేవిడ్ ఇక్కడ వర్షంలో బాగా ఎంజాయ్ చేశాడు. అతను వర్షంలో పరుగులు తీస్తూ నీటిలో డైవ్ చేస్తూ సందడి చేశాడు. టిమ్ డేవిడ్‌ను ఇలా వర్షంలో తడుస్తూ చూసిన ఆర్‌సీబీ ఇతర ఆటగాళ్లు కూడా నవ్వుకున్నారు. అతను డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చినప్పుడు కొందరు ఆటగాళ్లు చప్పట్లు కొట్టారు. మరికొందరు తమ నవ్వును ఆపుకోలేకపోయారు. టిమ్ డేవిడ్‌తో పాటు ఫిల్ సాల్ట్, లుంగీ ఎన్‌గిడీ కూడా ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు తిరిగి వచ్చారు. వీరు టోర్నమెంట్ తాత్కాలికంగా నిలిపివేయబడిన తర్వాత తమ దేశాలకు వెళ్లిపోయారు. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్‌తో సహా అన్ని భారతీయ ఆటగాళ్లు జట్టు శిబిరానికి చేరుకున్నారు.

Also Read: Cristiano Ronaldo: ఫోర్బ్స్ 2025 ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే.. టాప్‌లో రొనాల్డో!

ఆర్‌సీబీ అద్భుత ప్రదర్శన

ఇప్పటివరకు ఆర్‌సీబీ ప్రదర్శన అత్యంత అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. అతను 11 మ్యాచ్‌లలో 505 పరుగులు సాధించాడు. ఆర్‌సీబీ జట్టు ప్రస్తుతం 16 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. ఆర్‌సీబీ 11 మ్యాచ్‌లలో 8 మ్యాచ్‌లను గెలిచింది. ఇప్పుడు 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. 1 మ్యాచ్ గెలిస్తే అది ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే శనివారం వర్షం కారణంగా ఆర్‌సీబీ vs కేకేఆర్ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిస్తే బెంగళూరు ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది. దక్షిణాఫ్రికా బౌలర్ లుంగీ ఎన్‌గిడీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ స్క్వాడ్‌లో ఉన్నందున ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆడలేరని వార్తలు వస్తున్నాయి.

శనివారం బెంగళూరు వాతావరణం ఎలా ఉంటుంది?

శనివారం, మే 17న బెంగళూరులో వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా ఉండదు. ఇక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం 75 శాతం వరకు ఉంది. అలాగే ఉదయం కూడా వర్షం కురిసే అవకాశం ఉంది.