Site icon HashtagU Telugu

Team India: ద్రావిడ్ కు ఇది కఠినమైన సమయం

Rahul Dravid

Rahul Dravid

ఆసియాకప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్ కూడా చేరలేకపోయింది. ఎన్నో భారీ అంచనాలు ఉన్నప్పటకీ పేలవమైన బౌలింగ్, కీలక సమయంలో బ్యాటర్ల వైఫల్యం కొంపముంచింది. దీంతో ఈ జట్టుతో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ ఎలా ఆడుతుందో అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ సెలక్టర్ సాబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్ గా రాహుల్ ద్రావిడ్ హనీమూన్ పీరియడ్ ముగిసిందన్నాడు.

రానున్న నాలుగు,ఐదు నెలలు ద్రావిడ్ కు ఎంతో కఠినమైన సమయంగా విశ్లేషించాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్, వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ గెలిస్తేనే కోచ్ గా ద్రావిడ్ కు సంతృప్తి లభిస్తుందన్నాడు. 2021లో టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రవిడ్‌పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయన్నాడు. టీమ్ ను అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా నడిపించేందుకు ద్రావిడ్ కష్టపడుతున్నా ఫలితాలు మాత్రం రావడం లేదన్నాడు. ద్రావిడ్ కోచింగ్ లోనే టీమిండియా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌, ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో విజయం సాధించాల్సి ఉన్నప్పటకీ అలా జరగలేదన్నాడు. ఇప్పుడు ఆసియాకప్ లో వైఫల్యం కూడా నిరాశకు గురి చేస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే రానున్న కాలం ది వాల్ కు సవాల్ గా అభివర్ణించాడు. త్వరలో టీ20 ప్రపంచకప్‌ రాబోతోందనీ, వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ కూడా ఉందనీ… ఈ రెండింటిపై దృష్టి పెట్టాలన్నాడు.

ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ ఛాంపియన్ గా నిలిచి, విదేశాల్లో టెస్ట్ సిరీస్ లు గెలిస్తేనే కోచ్ గా ద్రావిడ్ సక్సెస్ సాధించినట్టన్నాడు. ఈ విషయం గురించి అతనికి తెలుసని, ఏదేమైనా టీ ట్వంటీ వరల్డ్ కప్ తో రాహుల్ ద్రావిడ్ కు సవాల్ ఎదురుకాబోతోందని సాబా కరీం అభిప్రాయపడ్డాడు.