శ్రీలంకతో టీ ట్వంటీ సీరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి టీ ట్వంటీలో గెలుపు అంచుల వరకూ వచ్చిన లంక రెండో మ్యాచ్ లో మాత్రం పుంజుకుని విజయాన్ని అందుకుంది. ఉత్కంఠ పోరులో 16 రన్స్ తేడాతో గెలిచి సీరీస్ సమం చేసింది. ఈ మ్యాచ్ లో విజయం కోసం భారత్ (India) కూడా చివరి వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. నో బాల్స్ , టాపార్డర్ వైఫల్యం టీమిండియా (Team India) ఓటమికి కారణాలుగా చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు 7 నోబాల్స్ వేయడం ఓటమిని శాసించింది. ఈ నో బాల్స్ ద్వారా శ్రీలంక అదనంగా 36 పరుగులు చేసింది. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ ఈ మ్యాచ్ లో తీవ్రంగా నిరాశ పరిచాడు. దీనిలో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే 5 నోబాల్స్ వేసాడు. ఈ అనవసర పరుగులే టీమిండియా (Team India) ఓటమిని శాసించాయి.
ఇక బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ విఫలమవడం కొంప ముంచింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. వరుస ఓవర్లలో టీమిండియా టాప్-3 వికెట్లను కోల్పోయింది. కాసున్ రజితా వేసిన రెండో ఓవర్‌లో ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్ కాగా.. శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఔటయ్యాడు. కాసేపటికే అరంగేట్ర ప్లేయర్ రాహుల్ త్రిపాటి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా సిక్స్, ఫోర్‌తో జోరు కనబర్చినా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు.
ఆ తర్వాత అక్షర్ పటేల్, సూర్యకుమార్ అదరగొట్టారు. తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు. వరుసగా మూడు ఓవర్లలో శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు వేగాన్ని పెంచారు. వీరిద్దరి జోరుతో మళ్ళీ భారత్ (India) విజయం సాధించేలా కనిపించింది. కీలక సమయంలో వీరిద్దరూ ఔటవదంతో భారత్ కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. భారత్ 5 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకవేళ టాపర్డర్ లో ఒక్కరయ్యినా ధాటిగా ఆడి ఉంటే టీమిండియా సునాయసంగా గెలిచేది.
Also Read: West Godavari : సంక్రాంతి కి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ హెచ్చరిక