అండర్-19 మహిళల టీ20 ఆసియా కప్(U19 Women’s Asia Cup)లో అజేయంగా నిలిచిన భారత్ శ్రీలంకను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఫైనల్లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ తరఫున ఆయుషి శుక్లా నాలుగు ఓవర్లలో పది పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇందుకు గానూ ఆమెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
టాస్ గెలిచి బౌలింగ్ చేసిన భారత్ శ్రీలంకను 9 వికెట్లకు 98 పరుగులకే పరిమితం చేసింది. పరుణికా సిసోడియా రెండు వికెట్లు తీసింది. శ్రీలంక తరఫున నిసంసల 21, కెప్టెన్ మనుడి 33 పరుగులు చేశారు. మిగతా వారెవ్వరు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. శ్రీలంక నిర్దేశించిన 99 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఆరంభంలోనే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. మూడో బంతికి ఓపెనర్ ఈశ్వరి అవుట్ అయింది ఆ తర్వాత కమలిని 28, త్రిష 32 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు. తెలుగు తేజం గొంగడి త్రిష (Trisha ) 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32 పరుగులతో దూకుడుగా ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు త్రిష గతమ్యాచ్‌లో బంగ్లాపై హాఫ్ సెంచరీ బాదింది.
శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ చమోడి ప్రబోద 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఓ దశలో ప్రబోద దూకుడు చూసి భారత్ కంగారు పడింది. కానీ ఆమెకు మరో బౌలర్ నుంచి మద్దతు లేకపోవడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వెళ్ళిపోయింది.నిజానికి భారత్ లీగ్ దశ నుంచే అద్భుతాలు చేస్తూ వచ్చింది. తొలి మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీని తరువాత బంగ్లాదేశ్ , శ్రీలంకలను మట్టికరిపించింది, నేపాల్‌తో జరిగిన మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. ఆదివారం బ్యూమాస్ క్రికెట్ ఓవల్‌లో జరగనున్న ఈ టోర్నీ ప్రారంభ ఎడిషన్ టైటిల్ మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
Read Also : Telangana Assembly : కేటీఆర్ పై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఫైర్