జింబాబ్వే పర్యటనలో భారత యువ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో ఓడినా పుంజుకున్న యంగ్ ఇండియా (Young India Team) వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. హరారే వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీలో 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఉన్న జైశ్వాల్ (Jaiswal) , సంజూ శాంసన్, శివమ్ దూబేలు జట్టులోకి రాగా… సాయిసుదర్శన్, జురెల్, ముకేశ్ కుమార్ లపై వేటు పడింది.మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 182 పరుగులు చేసింది.
కెప్టెన్ శుభ్ మన్ గిల్ (Shubamn Gill) ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి వికెట్ కు జైశ్వాల్ తో కలిసి 8.1 ఓవర్లలోనే 67 పరుగులు జోడించాడు. జైశ్వాల్ 36 రన్స్ కు ఔటవగా.. రెండో టీ ట్వంటీలో సెంచరీ హీరో అభిషేక్ శర్మ (Abhishek Sharma) నిరాశపరిచాడు. 10 పరుగులకే ఔటయ్యాడు. ఈ దశలో గిల్, రుతురాజ్ గైక్వాడ్ దూకుడుగా ఆడారు. గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేయగా…రుతురాజ్ 49 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.
తర్వాత ఛేజింగ్ లో జింబాబ్వేు ఆరంభం నుంచే భారత బౌలర్లు దెబ్బకొట్టారు. అవేశ్ ఖాన్ (Avesh Khan) , స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ధాటికి ఆతిథ్య జట్టు వరుస వికెట్లు కోల్పోయింది. కేవల 39 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది. అయితే మైర్స్ , వికెట్ కీపర్ మదాండే పోరాడడంతో స్కోర్ 150 దాటగలిగింది. చివరికి జింబాబ్వే (Zimbabwe) 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 , వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టీ ట్వంటీ (T20) శనివారం జరుగుతుంది.