Site icon HashtagU Telugu

India Win: అదరగొట్టిన సూర్య, కుల్దీప్.. మూడో టీ ట్వంటీ మనదే, సిరీస్ సమం..!

India Win

Suryakumar Imresizer (1)

India Win: సౌతాఫ్రికా టూర్ లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. సిరీస్ చేజారిపోయే ప్రమాదం పొంచి ఉన్న వేళ అదరగొట్టిన టీమిండియా మూడో టీ ట్వంటీలో 106 పరుగుల తేడాతో విజయం (India Win) సాధించింది. తద్వారా సిరీస్ ను 1-1 తో సమంగా ముగించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. 29 పరుగులకే గిల్ , తిలక్ వర్మ వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో యశస్వి జైశ్వాల్ , సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నారు. పవర్ ప్లేలో 62 పరుగులు చేసిన వీరిద్దరూ తర్వాత మరింత ధాటిగా ఆడారు. జైస్వాల్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. సూర్య 32 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 112 పరుగులు జోడించారు. జైశ్వాల్ 60 పరుగులకు ఔటవగా..,,తర్వాత క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ సాయంతో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ట్రేడ్ మార్క్ సిక్స్‌లతో అభిమానులను అలరించాడు. సూర్య 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో సూర్యకు ఇది నాలుగో శతకం. సూర్యకుమార్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరికి భారత్ 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు తీయగా.. నాండ్రె బర్గర్, టబ్రైజ్ షంసీ తలో వికెట్ పడగొట్టారు.

Also Read: Karthikeya : విజయ్‌ దేవరకొండ చేయాల్సిన సినిమా.. కార్తికేయ అందుకొని హిట్..

భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేసారు. వరుస వికెట్లు తీస్తూ పైచేయి సాధించారు. టాపార్డర్ లో మక్రమ్ తప్పిస్తే మిగిలిన వారంతా చేతులెత్తేశారు. స్పిన్నర్ల ఎంట్రీతో సౌతాఫ్రికా మరింత వేగంగా వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ తన మ్యాజిక్ చూపించాడు. వరుస వికెట్లు పడుతున్నా డేవిడ్ మిల్లర్ ధాటిగా ఆడి కాసేపు అలరించాడు. అయితే మరో ఎండ్ లో మిగిలిన బ్యాటర్లను కుల్దీప్ యాదవ్ కుదురుకోనివ్వలేదు. మిల్లర్ 35 పరుగులకు ఔటవగా… సౌతాఫ్రికా ఇన్నింగ్స్ కు 95 పరుగులకే తెరపడింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కేవలం 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. జడేజా 2 వికెట్లు , అర్షదీప్ సింగ్ , ముఖేశ్ కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో టీ ట్వంటీ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవగా… రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిచింది. కాగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం నుంచి మొదలుకానుంది.

We’re now on WhatsApp. Click to Join.