T20 World Cup Final: రెండోసారి ట్రోఫీ ఎవరిదో..?

నాలుగు వారాలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న టీ ట్వంటీ ప్రపంచకప్‌ తుది అంకానికి చేరింది.

  • Written By:
  • Updated On - November 12, 2022 / 03:35 PM IST

నాలుగు వారాలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న టీ ట్వంటీ ప్రపంచకప్‌ తుది అంకానికి చేరింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లాండ్ , పాకిస్థాన్ తలపడబోతున్నాయి. మెల్‌బోర్న్ ఆతిథ్యమిస్తున్న టైటిల్ ఫైట్‌లో ఎవరు గెలిచినా రెండోసారి ఛాంపియన్‌గా నిలుస్తారు. ఇప్పటికే ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఒక్కోసారి టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచాయి. కాగా బలాబలాల విషయానికొస్తే ఇంగ్లాండ్‌ సూపర్ ఫామ్‌లో కనిపిస్తోంది.

సూపర్ 12 స్టేజ్‌లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లీష్ టీమ్.. సెమీస్‌లో మాత్రం చెలరేగిపోయింది. భారత్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఓపెనర్లు హేల్స్, బట్లర్ ఇద్దరే 168 పరుగుల టార్గెట్‌ను అలవోకగా ఛేదించేశారు. మిగిలిన బ్యాటింగ్‌లో బెన్ స్టోక్స్, బ్రూక్ , లివింగ్‌ స్టోన్‌, మొయిన్ అలీపై అంచనాలున్నాయి. తుది జట్టులో సెమీస్‌కు డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ దూరమైనప్పటకీ.. ఇంగ్లాండ్ రాణించింది. అయితే తుది జట్టులో వీరిద్దరూ మళ్ళీ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బౌలింగ్‌లోనూ ఇంగ్లాండ్ నిలకడగా రాణిస్తోంది. భారత్‌పై తుది జట్టులో చోటు దక్కించుకున్న క్రిస్ జోర్డాన్ ఆకట్టుకున్నాడు. అలాగే శాన్ కురన్, క్రిస్ వోక్స్ , రషీద్ కూడా రాణించారు. మెల్‌బోర్న్‌లో వీరు ఇదే ఫామ్ కొనసాగిస్తే పాక్ బ్యాటర్లకు కష్టమేనని చెప్పొచ్చు.

Also Read:  ICC: ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే

మరోవైపు అదృష్టవశాత్తూ సెమీస్‌కు చేరిన పాకిస్థాన్ న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. పాకిస్థాన్ ఆటతీరు చూస్తే అసలు ఫైనల్‌కు చేరుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఇండియా, జింబాబ్వే చేతిలో ఓడిపోయిన పాక్ తర్వాత నెదర్లాండ్స్, సౌతాఫ్రికాలపై గెలిచింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడిపోవడంతో అనూహ్యంగా సెమీస్ రేసులో నిలిచిన ఆ జట్టు బంగ్లాపై గెలిచి ముందంజ వేసింది. సెమీఫైనల్లో కివీస్‌పై సమిష్టిగా రాణించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. అయితే నిలకడ లేని ఆటతీరే పాక్‌కు ప్రధాన బలహీనత. బ్యాటింగ్‌లో బాబర్ అజాం, మహ్మద్ రిజ్వాన్ విఫలమైతే… నమ్మకం పెట్టుకోదగిన బ్యాటర్ లేకపోవడం ఇబ్బందిగా మారింది. టోర్నీలో పెద్దగా రాణించని బాబర్, రిజ్వాన్ గత రెండు మ్యాచ్‌లలో సత్తా చాటారు.

మరోవైపు బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిదినే పాక్‌కు ప్రధాన బలం. షాహీన్ అఫ్రిది బంగ్లాదైశ్, కివీస్‌తో మ్యాచ్‌లలో అదరగొట్టాడు. అతనితో పాటు షాదాబ్ ఖాన్‌, హ్యారీస్ రవూఫ్‌పై అంచనాలున్నాయి. అయితే ఫైనల్లో ఉండే ఒత్తిడిని ఇరు జట్లూఎలా అధిగమిస్తుందనేదాని పైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తం మీద వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్, అదృష్టమే ఎక్కువగా కలిసొచ్చిన పాక్‌లలో ఎవరు ఛాంపియన్‌గా నిలుస్తారో చూడాలి. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న మెల్‌బోర్న్ పిచ్‌ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా అనుకూలిస్తుందని అంచనా. 160-170 స్కోర్ ఈ పిచ్‌పై కాపాడుకునే అవకాశముంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఫైనల్ పోరుకు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశముంది. టైటిల్‌ పోరుకు రిజర్వే ఉండగా… రేపు కూడా మ్యాచ్‌ జరగకుండా ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

Also Read:  Virat Kohli: సెమీస్ లో ఓటమిపై కోహ్లీ భావోద్వేగ ట్వీట్..!

Follow us