IND vs ZIM 3rd T20I: జింజాబ్వే పర్యటనలో బోణీ కొట్టిన భారత్ మూడో టీ ట్వంటీకి రెడీ అవుతోంది. తొలి మ్యాచ్ లో ఓడినప్పటికీ… తర్వాత రెండో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ సమం చేసింది. అభిషేక్ శర్మ మెరుపు సెంచరీతో పాటు రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ కీలక ఇన్నింగ్స్ లతో భారీ విజయాన్నే అందుకుంది. ఇదే జోరు కొనసాగిస్తూ సిరీస్ లో ఆధిక్యం పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది. అయితే భారత తుది జట్టు ఎంపిక ఇప్పుడు సవాల్ గా మారింది. ఎందుకంటే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఉన్న సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైశ్వాల్ జట్టుతో పాటు చేరారు. తుపాను కారణంగా విండీస్ నుంచి వీరి రాక ఆలస్యమవడంతో ఈ ముగ్గురూ తొలి రెండు మ్యాచ్ లకు అందుబాటులో లేరు. ఇప్పుడు వీరి ఎంట్రీతో తుది జట్టులో ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఓపెనర్ల రేసులో అభిషేక్ శర్మ, జైశ్వాల్ నిలిచారు. తొలి మ్యాచ్ లో డకౌటైనప్పటికీ…తర్వాత రెండో టీ ట్వంటీ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో జట్టుతో పాటు చేరిన జైశ్వాల్ ను బెంచ్ కే పరిమితం చేస్తారా అనేది చూడాలి. అలాగే వికెట్ కీపర్ రేసులో జురెల్, జితేశ్ శర్మలకు
తోడు సంజూ శాంసన్ కూడా పోటీపడుతున్నాడు. అనుభవం పరంగా సంజూకే అవకాశమిస్తారని సమాచారం. దీంతో జురెల్ బెంచ్ కే పరిమితం కాక తప్పదు. ఇక ఫినిషర్ రోల్ కోసం రింకూ సింగ్, శివమ్ దూబే రేసులో ఉండగా… ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. రింకూ సింగ్ రెండో మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. ఒకవేళ రింకూసింగ్ ను కొనసాగిస్తే…సాయిసుదర్శన్ ను తప్పించి దూబేను ఆడించొచ్చు. అయినప్పటకీ ఫినిషర్ రోల్ అవకాశాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే వరల్డ్ కప్ లో శివమ్ దూబే అంచనాలను అందుకోలేకపోయాడు. అదే సమయంలో రింకూ సింగ్ కు అసలు తుది జట్టులో చోటే దక్కలేదు. అందుకే ఎవరికి అవకాశం వచ్చినా చెలరేగేందుకు ఎదురుచూస్తున్నారు.
ఈ మార్పులు మినహా మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు బరిలోకి దిగనున్నారు. ఫినిషర్‌గా రింకూ బౌలింగ్ లో స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్, స్పెషలిస్ట్ స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ కొనసాగనున్నాడు. అటు పేస్ విభాగంలో ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్‌లకు చోటు ఖాయం. మొత్తం మీద తుది జట్టు ఎంపిక కెప్టెన్ గిల్, కోచ్ లక్ష్మణ్ లకు ఛాలెంజ్ గా మారిందని చెప్పొచ్చు.
Also Read: YSR 75th Birthday : ఎంతకాలమైనా వైఎస్‌ను మరచిపోలేము – రేవంత్‌రెడ్డి