Site icon HashtagU Telugu

T20 World Cup: సూపర్-8లో సూర్య డౌటేనా..?

T20 World Cup (1)

T20 World Cup (1)

T20 World Cup: టి20 ప్రపంచకప్ లీగ్ దశలో టీమ్ ఇండియా అదరగొట్టింది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చింది. జూన్ 20 నుండి రోహిత్ సేన సూపర్-8లోకి అడుగుపెట్టబోతుంది. సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడబోతుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. సూర్య గాయానికి సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. సూర్యకుమార్ యాదవ్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని కుడి చేతికి తగిలింది. భరించలేని నొప్పితో బాధపడుతూ ప్రాక్టీస్ మధ్యలోనే వెళ్ళిపోయాడట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పొట్టి ఫార్మెట్లో జట్టును ఆదుకునే ఈ స్టార్ బ్యాటర్ మిగతా మ్యాచ్ లకు దూరమైతే భారత్ మరింత కష్టపడాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అటు కోహ్లీ కూడా ఫామ్ లో లేకపోవడం మరింత ఆందోళనకరంగా మారింది.

టీ20 ఫార్మాట్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్న సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో తడబడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 100 పరుగుల మార్క్ అందుకోలేకపోయాడు. కానీ అమెరికాతో జరిగిన మ్యాచ్ లో క్లిష్ట పరిస్థితుల్లో సూర్య అజేయ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. దీంతో సూపర్-8 మ్యాచ్‌ల్లో భారత్‌కు భారీ స్కోర్లు చేసి విజయానికి తనవంతు సహకారం అందిస్తాడని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ అతను గాయపడటం ద్వారా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు రోహిత్ సేన సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే సూపర్-8లోనూ విజయ పరంపర కొనసాగించాల్సి ఉంటుంది. జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్‌తో, జూన్ 22న బంగ్లాదేశ్‌తో, జూన్ 24న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లన్ని రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతాయి.

Also Read: IPL 2025: రోహిత్ కోసం వేచి చూస్తున్న ఆ మూడు ఫ్రాంచైజీలు