Suryakumar Yadav: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 ఫార్మాట్‌లో స్పెషలిస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 2024 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20లో హార్దిక్ టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉంటాడని అంతా భావించారు. అయితే ఇప్పుడు అలా జరగడం లేదని తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం.. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో కూడా హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ లభించదని సమాచారం.
మీడియా కథనాల ప్రకారం.. శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నట్లు సమాచారం. 30 ఏళ్ల హార్దిక్ 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే రోహిత్ రిటైర్మెంట్ తర్వాత కూడా అతనికి కెప్టెన్సీ దక్కటంలేదు. అయితే హార్దిక్‌ను టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించకపోయినప్పటికీ శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో కమాండ్ హార్దిక్ చేతుల్లోనే ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.
espncricinfo నివేదిక ప్రకారం.. శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు కెప్టెన్‌గా ఉంటాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వటంలేదని సమాచారం. మరో నివేదిక ప్రకారం శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ లేదా రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఉండవచ్చని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు టీమ్ ఇండియాను ప్రకటించనున్నారు
జులై 27 నుంచి శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే శ్రీలంకలో టీ20 సిరీస్ తర్వాత భారత జట్టు మూడు వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. మీడియా కథనాల ప్రకారం శ్రీలంక టూర్‌కు టీమిండియాను నేడు ప్రకటించనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ జట్టును ఎంపిక చేయనున్నారు. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత కారణాలతో శ్రీలంకతో వన్డే సిరీస్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు.