Site icon HashtagU Telugu

Suresh Raina : సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ క్రికెటర్

Star cricketer to make his entry into films

Star cricketer to make his entry into films

Suresh Raina : టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు, ‘చిన్న తలా’గా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల గుండెల్లో చెక్కిన పేరు సురేశ్ రైనా. అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన స్టైల్‌తో కోట్లాది మందిని మెప్పించిన ఈ ఆటగాడు ఇప్పుడు ఓ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి బౌండరీలకంటే భారీగా వెండితెర మీదే సిక్సర్లు కొట్టాలని ఉత్సాహంగా ఉన్నాడు రైనా. క్రికెట్ బ్యాట్‌ను పక్కన పెట్టి, ఇప్పుడు కెమెరా ముందు యాక్షన్ చెప్పించనున్న రైనా తన సినీ ప్రయాణాన్ని తమిళ సినిమాతో ప్రారంభించబోతున్నాడు. క్రికెట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకు దర్శకుడు లోగాన్ మెగాఫోన్ పట్టుకోనున్నారు. ‘డ్రీమ్ నైట్ స్టోరీస్’ (DKS) బ్యానర్‌పై శ్రవణకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాణ సంస్థ ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Read Also: Raj Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు..20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు

తమిళనాడుతో రైనాకు ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆటగాడిగా చేసిన సేవ, అభిమానులతో ఏర్పడ్డ స్ఫూర్తిదాయక సంబంధం ఇవన్నీ కలిస్తే అతని తమిళ అభిమానులు అతన్ని ‘చిన్న తలా’గా అభిమానించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు అదే రాష్ట్ర భాషలో సినిమా చేస్తుండడం ఆయనకు మరింత ప్రత్యేకతను కలిగిస్తోంది. చెన్నైలో ఇటీవల నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రాజెక్టు అధికారికంగా లాంఛనప్రాయంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌కు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ శివమ్ దూబే ముఖ్య అతిథిగా హాజరై, నిర్మాణ సంస్థ లోగోను ఆవిష్కరించారు. రైనా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి నెదర్లాండ్స్‌లో ఉన్నప్పటికీ, ఈ వేడుకలో వర్చువల్‌గా పాల్గొని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇది నా జీవితంలో మరో కొత్త అధ్యాయం. అభిమానుల మద్దతుతో ఇది కూడా విజయవంతమవుతుందన్న నమ్మకం ఉంది అని రైనా వ్యాఖ్యానించాడు.

క్రీడా రంగం నుంచి సినీ రంగానికి మారిన భారత క్రికెటర్ల సరసన ఇప్పుడు రైనా చేరబోతున్నాడు. ఇంతకుముందు ఇర్ఫాన్ పఠాన్ ‘కోబ్రా’ అనే తమిళ సినిమాతో, హర్భజన్ సింగ్ ‘ఫ్రెండ్‌షిప్’ అనే చిత్రంతో నటుడిగా ప్రేక్షకులను పలకరించారు. అలాగే శిఖర్ ధావన్ బాలీవుడ్‌లో ఓ చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిశాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టి ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ అనే సినిమాను తన బ్యానర్‌లో నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో రైనా కూడా వెండితెర మీద తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. క్రికెట్‌లో తన ఆడిన ప్రతి ఇన్నింగ్స్‌ చూసిన అభిమానులకు, ఇప్పుడు అతని నటన చూస్తే మరో కొత్త కోణం కనిపించనుంది. రైనా ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడన్న ఆసక్తి ఇప్పటికే సినీ ప్రేమికుల్లో పెరిగింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుంది. క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు, సినిమా ప్రేక్షకులు కూడా ఇప్పుడు ‘చిన్న తలా’ నటనను ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నారు.

Read Also: Ramachander Rao : తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన ఎన్. రామచందర్‌రావు