Team India: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమ్ ఇండియా ప్రయాణం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ ఓటమితో సెమీఫైనల్ చేరడం భారత జట్టుకు ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. టీమ్ ఇండియా తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవడమే కాకుండా, నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడానికి భారీ విజయాలను నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏ దక్షిణాఫ్రికా జట్టు భారత్‌ను ఓడించి కష్టాల్లోకి నెట్టిందో ఇప్పుడు అదే జట్టు భారత్ సెమీఫైనల్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read: యూట్యూబర్ అన్వేష్‌కు బిగ్ షాక్!
దక్షిణాఫ్రికా భారత్‌కు ఎలా సహాయపడగలదు?
ప్రస్తుత సమీకరణాల ప్రకారం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే తమ మొదటి మ్యాచ్‌ల్లో గెలిచి పటిష్టంగా ఉన్నాయి. ఫిబ్రవరి 26, 2026న (అనగా రేపు) ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ కీలక పోరులో దక్షిణాఫ్రికా గనుక వెస్టిండీస్‌ను ఓడిస్తే అది భారత్‌కు వరంలా మారుతుంది.
దక్షిణాఫ్రికా విజయం వల్ల భారత్‌కు కలిగే ప్రయోజనాలు
నెట్ రన్ రేట్ ఆందోళన తగ్గుతుంది: ఒకవేళ దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడిస్త భారత్ నెట్ రన్ రేట్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. కేవలం తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే సరిపోతుంది.
జింబాబ్వేపై విజయం కీలకం: భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించి అటు దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌పై గెలిస్తే సమీకరణం మరింత స్పష్టమవుతుంది.
మార్చి 1న ‘నాకౌట్’ పోరు: ఈ ఫలితాల తర్వాత మార్చి 1న భారత్- వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ ఒక అనధికారిక ‘నాకౌట్’ మ్యాచ్‌గా మారుతుంది. ఆ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటారు.
ఒకవేళ రేపటి మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిస్తే మాత్రం భారత్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అప్పుడు టీమ్ ఇండియా తన తదుపరి మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవడమే కాకుండా, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి భారత అభిమానులంతా ఇప్పుడు టీమ్ ఇండియా గెలవాలని కోరుకోవడంతో పాటు రేపటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలవాలని కూడా ప్రార్థించాల్సి ఉంటుంది.
