Site icon HashtagU Telugu

SA Beats Bangladesh: బంగ్లాను చిత్తు చేసిన సఫారీలు

South Africa

South Africa

తొలి మ్యాచ్ లో వర్షం కారణంగా గెలుపు ముంగిట నిలిచిపోయిన సౌతాఫ్రికా రెండో మ్యాచ్ లో అదరగొట్టింది. బంగ్లాదేశ్ పై భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో బంగ్లాదేశ్ పై సఫారీ టీమ్ 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సౌతాఫ్రికా బ్యాటర్ రొస్కో సెంచరీనే హైలైట్. మొదట బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 205 పరుగుల భారీస్కోర్ చేసింది. కెప్టెన్ బవుమా 2 రన్స్ కే ఔటైనా.. మరో ఓపెనర్ డికాక్, రొస్కో రెచ్చిపోయారు. బంగ్లా బౌలర్లను ఆటాడుకున్న వీరిద్దరూ రెండో వికెట్ కు 13 ఓవర్లలోనే 168 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో డికాక్ 38 బంతుల్లో 63 రన్స్ కు ఔటైనా.. రొస్కో మాత్రం శతకం సాధించాడు. రొస్కో 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో కెప్టెన్ షకీబుల్ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్ లో బంగ్లాదేశ్ పూర్తిగా తేలిపోయింది. ఏ దశలో లక్ష్యం దిశగా సాగలేదు. సఫారీ పేసర్ నోర్జే , స్పిన్నర్ షంషీ ధాటికి ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. బంగ్లా ఇన్నింగ్స్ లో నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగా.. లిట్టన్ దాస్ చేసిన 34 రన్స్ టాప్ స్కోర్. దీంతో బంగ్లాదేశ్ 101 పరుగులకే కుప్పకూలింది. నోర్జే 4 వికెట్లు, షంషీ 3 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. టోర్నీలో సౌతాఫ్రికాకు ఇదే తొలి విజయం. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.