Sophia Dunkley: ఒకే ఓవర్లో 4,6,6,4,4..ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. వుమెన్స్ ఐపీఎల్‌లో సోఫియా విధ్వంసం

మహిళల క్రికెట్‌లో పరుగుల వరద పారుతోంది. ప్రతీ మ్యాచ్‌లోనూ స్కోర్లు సునాయాసంగా 200 దాటేస్తున్నాయి. విదేశీ హిట్టర్లు రికార్డుల మోత మోగిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - March 8, 2023 / 09:56 PM IST

మహిళల క్రికెట్‌లో పరుగుల వరద పారుతోంది. ప్రతీ మ్యాచ్‌లోనూ స్కోర్లు సునాయాసంగా 200 దాటేస్తున్నాయి. విదేశీ హిట్టర్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ సోఫియా డంక్‌లీ (Sophia Dunkley) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయింది. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయింది. ఆర్‌సీబీ బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ ఇంగ్లీష్ బ్యాటర్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో మహిళల క్రికెట్‌లో రికార్డు నెలకొల్పింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో వరుసగా 4,6,6,4,4 కొట్టింది. మహిళల ఐపీఎల్‌లో మొన్న హర్మన్‌ప్రీత్‌ కౌర్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేయగా.. ఇప్పుడు ఆ రికార్డును సోఫియా బ్రేక్ చేసింది. హర్మన్ ప్రీత్ 22 బంతుల్లో ఫిఫ్టీ చేస్తే.. సోఫియా కేవలం 18 బంతుల్లోనే దానిని అందుకుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే సోఫియా ఆడిన బ్యాటింగ్ తీరు వేరే లెవెల్‌. మొదటి బంతి నుంచే ఎటాకింగ్ మూడ్‌తో ఆడిన సోఫియా భారీ షాట్లతో రెచ్చిపోయింది. ప్రీతి వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో సోఫియా 23 పరుగులు చేసిందంటే ఆమె బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. సోఫియా జోరుకు గుజరాత్‌ కేవలం 8 ఓవర్లలోనే 82 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు 5 ఓవర్లలోనే 60 పరుగులు జోడించింది. సోఫియా డంక్‌లీ (Sophia Dunkley) 28 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 62 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. కేవలం 3 మాత్రమే సింగిల్స్‌గా వచ్చాయి. మొత్తం మీద మహిళల ఐపీఎల్‌ తొలి సీజన్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు రెండుసార్లు బ్రేక్ అయింది. రానున్న మ్యాచ్‌లలో మరిన్ని రికార్డులు బద్దలవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

Also Read:  Dry Fruits: నకిలీ డ్రై ఫ్రూట్స్ ను గుర్తించడం ఇలా..!