Site icon HashtagU Telugu

Shubman Gill Captaincy: హై హై నాయకా.. గిల్ శకం మొదలైందిగా!

Shubman Gill Captaincy

Shubman Gill Captaincy

Shubman Gill Captaincy: భారత క్రికెట్ లో శుభమన్ గిల్ (Shubman Gill Captaincy) శకం మొదలైంది. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టు పగ్గాలు అందుకున్న గిల్ కు తొలి సిరీసే పెద్ద సవాల్ గా నిలిచింది. సిరీస్ గెలిచి 18 ఏళ్ళు దాటిపోయిన ఇంగ్లాండ్ గడ్డపై సారథిగా తొలి పరీక్షకు రెడీ అయ్యాడు. తొలి టెస్టులో గెలిచే అవకాశాలను చేజార్చుకున్నప్పటకీ.. సారథిగా పర్వాలేదనిపించాడు. తొలి టెస్ట్ ఓటమి తర్వాత రెండో మ్యాచ్ లో జట్టును అద్భుతంగా లీడ్ చేశాడు గిల్. బ్యాటర్ గా తన సూపర్ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ.. సారథిగా తన వ్యూహాలతో భారత్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేశాడు.

నిజానికి సారథిగా ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రదర్శన ఆశించిన స్థాయిలో ఉండదు. గతంలో చాలాసార్లు పలువురు కెప్టెన్ల విషయంలో ఇది రుజువైంది. ఎందుకంటే ఆ ఒత్తిడిని అధిగమించడం అంత ఈజీ కాదు. కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోలేక ఆ బాధ్యతలకు గుడ్ బై చెప్పిన క్రికెటర్లు కూడా ఉన్నారు. పైగా భారత్ లాంటి టీమ్ ను లీడ్ చేయడం ఎంత కష్టమే అందరికీ తెలుసు. ఎందుకంటే గెలిచినప్పుడు వచ్చే ప్రశంసలకు రెట్టింపు విమర్శలు ఓడిపోయినప్పుడు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని తట్టుకుని నిలబడి ఆటగాడిగా రాణించడం అతిపెద్ద సవాల్.

గిల్ కు సారథిగా ఇదే తొలి సిరీస్ కావడంతో అంచనాలు భారీస్థాయిలో అయితే లేవు. ఎందుకంటే కోహ్లీ, రోహిత్ , పుజారా, రహానే లాంటి సీనియర్లు లేకుండా యువ ఆటగాళ్ళతో కూడిన టీమ్ ఇంగ్లీష్ గడ్డపై సంచలనాలు సృష్టిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. పైగా తొలి టెస్ట్ ఓటమి తర్వాత ఈ స్థాయిలో కమ్ బ్యాక్ ఇస్తుందని కూడా ఎవ్వరూ ఊహించలేదు. కానీ గిల్ కెప్టెన్సీతో ఇది సాధ్యమైంది. అత్యంత చెత్త రికార్డున్న ఎడ్జ్ బాస్టన్ లో 58 ఏళ్ళ తర్వాత గెలుపు రుచి చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో దుమ్మురేపాడు.

Also Read: Breath Problem : అర్ధరాత్రి ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? ఊపిరి ఆగిపోయేలా ఉందా?

తనపై కెప్టెన్సీ ఒత్తిడి లేదని నిరూపించాడు. అతను ఆడిన ఇన్నింగ్స్ లో ఒక్క బ్యాడ్ షాట్ కూడా లేదని మాజీలు ప్రశంసించారంటే గిల్ ఎలా బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ ఆడిన తర్వాత నేరుగా ఇంగ్లాండ్ కు వచ్చిన గిల్ టెస్ట్ ఫార్మాట్ కు తగ్గట్టుగానే ఆటను మార్చుకున్నాడు. టెస్టుల్లో సక్సెస్ కావాలంటే ఎంతో ఓపిక కావాలి. మంచి బాల్స్ గౌరవించాలి.. చెత్త బాల్స్ ను బాదాలి… క్రీజులో సహనంతో బ్యాటింగ్ చేయాలి… వీటిని పర్ఫెక్ట్ గా ఫాలో అయినందుకే భారీ ఇన్నింగ్స్ లు ఆడగలిగాడు.

ఇక సారథిగా తనదైన మార్క్ చూపించాడు. ఫీల్డింగ్ సెటప్, బౌలర్లను మార్చడం, సహచరులను ఉత్సాహపరచడం ఇలా అన్ని విషయాల్లోనూ ముందుండి నడిపించాడు. ఇంగ్లాండ్ టూర్ లో ఈ సారి భారత్ ఒక్క మ్యాచ్ గెలిచినా గొప్పే అని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. అయితే ఒక మ్యాచ్ కాదు సిరీస్ గెలిచే ఉత్సాహాన్ని జట్టులో నింపాడు. రెండో టెస్ట్ విజయంతో లెక్క సరి చేసిన భారత్ ఇప్పుడు హిస్టారికల్ లార్డ్స్ మైదానంలోనూ దుమ్మురేపితే సిరీస్ గెలుపు అందడం ఖాయమే.. కానీ ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకుంటే మాత్రం గిల్ అండ్ కోకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఓటమి నుంచి కమ్ బ్యాక్ ఇవ్వడం ఇంగ్లాండ్ కు కూడా అలవాటే.. అందుకే టీమిండియా ఇప్పుడు మరింత అలెర్ట్ గా ఉండాలి.