భారత క్రికెట్‌లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. యువ బ్యాట్స్‌మన్ శుభమాన్ గిల్(Shubman Gill)ను భారత్ టెస్ట్ జట్టు కెప్టెన్ (India’s 37th Test Captain)గా నియమించారు. మే 24న ముంబైలో జరిగిన సీనియర్ సెలెక్షన్ కమిటీ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గిల్ 37వ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, రిషభ్ పంత్ ఆయనకు వైస్ కెప్టెన్ (Rishabh Pant vice-captain)గా ఎంపికయ్యారు. గిల్ సారథ్యంలో భారత్ జూన్ 20న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్ కోసం 18 మందితో కూడిన బలమైన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఇక ఈ జట్టులో కొన్ని సర్ప్రైజ్ ఎంపికలు చోటుచేసుకున్నాయి. తొలి టెస్ట్ అవకాశాన్ని సాయి సుదర్శన్, అర్షదీప్ సింగ్‌లకు కల్పించారు. మోహమ్మద్ షమీ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఎంపిక కాలేదు. బుమ్రా, సిరాజ్ లాంటి కీలక పేసర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవల ఇండియా A జట్టుకు నాయకత్వం వహించిన అభిమన్యు ఈశ్వరణ్‌కు మరో అవకాశం ఇచ్చారు. 25 ఏళ్ల గిల్‌కు టెస్ట్ ఫార్మాట్‌లో ఎక్కువగా కెప్టెన్సీ అనుభవం లేకపోయినప్పటికీ, 2024లో జింబాబ్వే టూర్‌లో టీ20 జట్టుకు నాయకత్వం వహించడం, ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం సెలక్టర్లు కు నమ్మకాన్ని కలిగించింది.
ఇప్పటి వరకు గిల్ 32 టెస్టుల్లో 1893 పరుగులు చేసి 5 సెంచరీలు చేశాడు. అయితే విదేశాల్లో (SENA దేశాలు మరియు వెస్టిండీస్) ఆయన రికార్డు ఆశాజనకంగా లేదు. 13 మ్యాచ్‌ల్లో కేవలం 559 పరుగులు మాత్రమే చేసి, 25 సగటుతో ఉన్నారు. అయినా గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ముందుగానే నిర్ణయంగా భావిస్తున్నారు. కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్లు టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో యువ జట్టుతో కొత్త శకం ప్రారంభమవుతోంది. అభిమానులు గిల్ సారథ్యంలో భారత జట్టు తిరిగి విజయాల బాట పట్టాలని ఆశిస్తున్నారు.