Shreyas Iyer: న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం ఇటీవల భారత జట్టును ప్రకటించారు. టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టులోకి తిరిగి వచ్చారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో గాయపడిన తర్వాత ఆయన కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యారు. ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఆయనను మళ్ళీ ఎంపిక చేశారు. ఈ కమ్‌బ్యాక్ తర్వాత అయ్యర్‌కు మరో శుభవార్త అందింది. విజయ్ హజారే ట్రోఫీలో తదుపరి రెండు మ్యాచ్‌లకు ఆయన ముంబై జట్టుకు కెప్టెన్సీ వహించనున్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో సారథిగా అయ్యర్
ముంబై ప్రస్తుత కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ కాలి పిక్క గాయం కారణంగా టోర్నమెంట్ నుండి తప్పుకున్నారు. ఆయన స్థానంలో అయ్యర్ లీగ్ స్టేజ్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. దీనిపై ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కార్యదర్శి డాక్టర్ ఉన్మేష్ ఖాన్విల్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన లీగ్ స్టేజ్ మ్యాచ్‌లకు ముంబై సీనియర్ మెన్స్ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరిస్తారని ప్రకటించడానికి MCA సంతోషిస్తోంది. గాయం కారణంగా టోర్నీకి దూరమైన శార్దూల్ ఠాకూర్ స్థానాన్ని అయ్యర్ భర్తీ చేస్తారని తెలిపారు.
Also Read: జన నాయకుడు మూవీ ఎఫెక్ట్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి భగవంత్ కేసరి..
శ్రేయస్ అయ్యర్ మ్యాచ్‌ల షెడ్యూల్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో ముంబై తన తదుపరి రెండు మ్యాచ్‌లను హిమాచల్ ప్రదేశ్- పంజాబ్‌లతో ఆడనుంది. జనవరి 6న జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్. ఇది అయ్యర్ కమ్‌బ్యాక్ మ్యాచ్. జనవరి 8న పంజాబ్‌తో మ్యాచ్. ఇది లీగ్ స్టేజ్‌లో ముంబైకి చివరి మ్యాచ్.
ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే టీమ్ ఇండియాలోకి
శ్రేయస్ అయ్యర్ భారత జట్టు స్క్వాడ్‌లోకి ఎంపికైనప్పటికీ ఆయన ఫిట్‌నెస్ ఇంకా కీలకంగా మారింది. ఒకవేళ BCCI CoE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) నుండి అనుమతి లభించకపోతే ఆయన వన్డే సిరీస్‌లో ఆడలేరు. అటువంటి పరిస్థితుల్లో ఆయన స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అయ్యర్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నార. కాబట్టి ఇక్కడ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే మూడు నెలల విరామం తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో బరిలోకి దిగుతారు.
