Shreyas Iyer: బుధవారం (జనవరి 14) న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందరి దృష్టిని ఆకర్షించనున్నారు. వన్డే క్రికెట్‌లో ఒక భారీ వ్యక్తిగత మైలురాయిని చేరుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. భారత జట్టు నమ్మదగ్గ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఎదిగిన అయ్యర్.. వన్డేల్లో అతివేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరబోతున్నారు.
కేవలం 34 పరుగుల దూరంలో
శ్రేయస్ అయ్యర్ 3000 వన్డే పరుగుల మార్కును చేరుకోవడానికి కేవలం 34 పరుగులు మాత్రమే అవసరం. ఒకవేళ రేపటి మ్యాచ్‌లో ఆయన ఈ లక్ష్యాన్ని చేరుకుంటే కేవలం 69 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తారు.
కోహ్లీ, ధావన్ రికార్డులు కనుమరుగు!
ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా అయ్యర్ దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టనున్నారు. శిఖర్ ధావన్ 72 ఇన్నింగ్స్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేశారు. విరాట్ కోహ్లీ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నారు. ప్రస్తుతం అయ్యర్ ఉన్న ఫామ్ చూస్తుంటే వన్డే ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యంత నిలకడగా రాణిస్తున్న ఆటగాడిగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనున్నారు.
Also Read: రైతు సంక్షేమంలో నూతన అధ్యాయం.. తెలంగాణలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణ!
గాయం తర్వాత బలమైన పునరాగమనం
2025 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో గాయపడిన అయ్యర్ ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు దూరమయ్యారు. అయితే పునరాగమనం చేస్తూ కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో 47 బంతుల్లో 49 పరుగులు చేసి, 301 పరుగుల లక్ష్య ఛేదనలో కీలక పాత్ర పోషించారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కఠిన శ్రమ, విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున అద్భుత ప్రదర్శన ఆయనను మళ్ళీ జట్టులోకి తెచ్చాయి.
వివ్ రిచర్డ్స్ సరసన అయ్యర్
ఒకవేళ 69 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు పూర్తి చేస్తే ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో వేగవంతమైన ఆటగాడిగా అయ్యర్ నిలుస్తారు. ఈ జాబితాలో హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్‌లు) ప్రపంచ రికార్డుతో అగ్రస్థానంలో ఉన్నారు. 2017లో అరంగేట్రం చేసినప్పటి నుండి అయ్యర్ టీమిండియాలో ఒక కీలక ఆటగాడిగా ఎదిగారు.
