Indonesia Open: సాత్విక్ – చిరాగ్ జోడీ సరికొత్త చరిత్ర… ఇండోనేషియా సూపర్ సీరీస్ టైటిల్ కైవసం

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో అద్భుత విజయం...పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది.

Indonesia Open: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో అద్భుత విజయం…పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారి సూపర్ సీరీస్ 1000 టైటిల్ కైవసం చేసుకుంది.
ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్‌ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి విజయం సాధించింది. టైటిల్ పోరులో మలేషియా ప్లేయర్స్ , వరల్డ్ ఛాంపియన్స్ ఆరోన్ చియా, సో వోయిక్ జోడీ పై 21-17, 21-18 స్కోర్ తో అద్భుత విజయాన్ని అందుకొని విజేతగా నిలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం కనబరిచిన భారత జోడీ రెండు గేమ్స్ లోనే వరల్డ్ ఛాంపియన్ జోడీని మట్టికరిపించింది. దీంతో సూపర్ 1000 టోర్నమెంట్‌ గెలిచిన మొదటి భారతీయ జంటగా నిలిచింది. అంతకు ముందు సెమీ-ఫైనల్స్‌లో టాప్ సీడ్‌ ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ ర్యాన్ ఆర్డియాంటోలను ఓడించి ఫైనల్ లో అడుగు పెట్టింది.

గత కొంత కాలంగా భారత బ్యాడ్మింటన్ డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడి
వరుస విజయాలతో అదరగొడుతోంది. ఇటీవలే ఆసియా ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెలిచి
సరికొత్త చరిత్ర సృష్టించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 8 ర్యాంకర్లయిన మలేసియాకు చెందిన యెన్ సిన్-టెయో ఈ యి జంటపై ప్రపంచ నంబర్ 6 జోడీ అయిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి చారిత్రక విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం పతకం. తాజాగా ఇండోనేషియా సూపర్ 1000 టైటిల్ గెలిచి మరో చారిత్రక విజయాన్ని అందుకుంది.

Read More: Thailand: దారుణం.. యవ్వనం కోసం ముసలి రక్తంలో మద్యం కలుపుకొని తాగేస్తున్నాడుగా?