Site icon HashtagU Telugu

Shane Warne: షేన్‌ వార్న్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్

Players

Players

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌ వార్న్ (Shane Warne) మృతి చెంది నేటికి ఏడాది పూర్తి కావొస్తోంది. దీంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు వార్న్‌ను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు. గత ఏడాది మార్చి 7న ఈ ఆసీస్ లెజెండరీ స్పిన్నర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. వరల్డ్ క్రికెట్‌లో వార్న్‌ ఎంతటి గొప్ప స్పిన్నరో అతని రికార్డులే చెబుతాయి. సుధీర్ఘ కాలం పాటు తన స్పిన్ మ్యాజిక్‌తో ఆసీస్‌కు ఎన్నో చారిత్రక విజయాలను అందించాడు. వార్న్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న కొద్ది మందిలో సచిన్ టెండూల్కర్ ఖచ్చితంగా ఉంటాడు. అయితే వార్న్‌తో కేవలం మైదానంలో పోటీనే కాదు వ్యక్తిగతంగానూ సచిన్‌కు మంచి స్నేహం ఉంది. వార్న్ మొదటి వర్థంతి కావడంతో టెండూల్కర్ అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆన్ ది ఫీల్డ్‌లో వార్న్‌ ప్రత్యర్థిగా ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లు ఆడానని సచిన్ గుర్తు చేసుకున్నాడు. గొప్ప ఆటగాడు మాత్రమే కాదని , తనకు మంచి స్నేహితుడంటూ వార్న్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విట్ చేశాడు.

వార్న్ బౌలింగ్‌ను ఆస్వాదించని అభిమాని లేడంటూ వ్యాఖ్యానించాడు. సచిన్‌తో పాటు మరికొందరు మాజీ ఆటగాళ్ళు ట్విట్టర్ వేదికగా మరోసారి వార్న్‌కు నివాళి అర్పించారు. వార్న్ లాంటి బౌలర్‌ జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడంటూ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా సోషల్ మీడియాలో వార్న్‌కు నివాళి అర్పించాడు. కింగ్ వార్న్ అంటూ వాన్ ట్వీట్ చేశాడు. ఇంకా పలువురు క్రికెటర్లు , అభిమానులు షేన్‌ వార్న్‌కు (Shane Warne) సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు. వార్న్‌ సాధించిన రికార్డులను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెట్టారు. 1992 నుంచి 2007 వరకూ 15 ఏళ్ళ సుధీర్ఘ కెరీర్‌లో వార్న్ ఎన్నో రికార్డులు సాధించాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టి గ్రేటెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. 1990 నుంచి 2000 వరకూ ప్రపంచ క్రికెట్‌లో ఆసీస్ ఆధిపత్యం కనబరిచిన జట్టులో వార్న్ కూడా కీలక ఆటగాడిగా ఉన్నాడు.

Also Read:  Women’s IPL Preview: ఇక అమ్మాయిల ధనాధన్

Exit mobile version