Ross Taylor: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ (Ross Taylor) 41 ఏళ్ల వయస్సులో మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రానున్నారు. ఈసారి ఆయన సమోవా తరపున బరిలోకి దిగనున్నారు. అక్టోబర్‌లో ఒమన్‌లో జరగనున్న ఏషియా-ఈస్ట్ ఏషియా పసిఫిక్ T20 వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్స్‌లో టేలర్ సమోవా జట్టులో భాగంగా ఆడనున్నారు. ఈ టోర్నమెంట్‌లో మంచి ప్రదర్శన చేస్తే సమోవా వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కి అర్హత సాధించవచ్చు.
టేలర్‌కు తన తల్లి ద్వారా సమోవా పాస్‌పోర్ట్ ఉంది. 2022 ఏప్రిల్‌లో న్యూజిలాండ్ తరపున చివరి మ్యాచ్ ఆడిన తర్వాత మూడు సంవత్సరాల కూలింగ్-ఆఫ్ పీరియడ్ పూర్తవడంతో ఆయన సమోవా జట్టుకు ఆడటానికి అర్హత సాధించారు.
సమోవా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
సమోవా అనేది ఓషియానియా ప్రాంతంలో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది అమెరికన్ సమోవాకు 64 కిలోమీటర్ల పశ్చిమాన ఉంది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. 1984లో మొదటిసారిగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంది. 2018 ఏప్రిల్‌లో ఐసీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. దానిలోని 104 సభ్య దేశాలకు T20I స్టేటస్ లభించింది. దీంతో 2019 జనవరి 1 నుంచి సమోవా జట్టు T20I క్రికెట్ ఆడటం ప్రారంభించింది. 2024 గణాంకాల ప్రకారం.. సమోవా జనాభా కేవలం 2 లక్షల 18 వేలు మాత్రమే.
Also Read: Bathukamma: ఈనెల 21 నుంచి బతుకమ్మ సంబరాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ?
సమోవా జట్ల రికార్డులు
పురుషుల జట్టు: ఇప్పటివరకు 25 T20I మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 6 గెలిచి, 19 ఓడిపోయింది. వనువాతుపై వారి రికార్డు ఉత్తమంగా ఉంది. అయితే హాంగ్‌కాంగ్, మలేషియా, పాపువా న్యూ గినియా, సింగపూర్ వంటి జట్లను ఓడించడంలో ఇంకా విజయం సాధించలేదు.
మహిళల జట్టు: పురుషుల జట్టు కంటే ఎక్కువ T20I మ్యాచ్‌లు ఆడింది. ఇప్పటివరకు 42 మ్యాచ్‌లు ఆడి, 20 గెలిచి, 20 ఓడిపోయింది, రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. ఫిజీపై వారి రికార్డు చాలా బాగుంది. ఈ ఏడాది సమోవా అండర్-19 మహిళల జట్టు టీ20 ప్రపంచకప్‌లో ఆడి, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లతో తలపడి మంచి అనుభవం సంపాదించుకుంది.
రాస్ టేలర్ పాత్ర కీలకం
ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫైయర్స్‌లో సమోవా పురుషుల జట్టు అక్టోబర్ 8 నుంచి 17 వరకు ఆడనుంది. ఈ టోర్నమెంట్ నుంచి మూడు జట్లు ప్రధాన ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ కీలకమైన టోర్నమెంట్‌లో రాస్ టేలర్ అనుభవం సమోవా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
సమోవా జట్టు స్క్వాడ్: కేలబ్ జస్మత్ (కెప్టెన్), రాస్ టేలర్, డేరియస్ విసర్, షాన్ సోలియా, డేనియల్ బర్గెస్, డగ్లస్ ఫినావు, సామ్ ఫ్రెంచ్, కర్టిస్ హైనమ్-నైబర్గ్, బెన్ మలాటా, నోవా మీడ్, సోలోమన్ నాష్, సామ్సన్ సోలా, ఫెరెటి సులులోటో, సౌమాని టియా, ఇలి తుగాగా.