Rohit vs Virat: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి టీమిండియాను భారీగా దెబ్బ తీసింది. అంతకుముందు కివీ జట్టు విషయంలోనే ఇదే జరిగింది. న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై వైట్ వాష్ అయి భారత్ పరువు పోగొట్టుకుంది. ఈ రెండు టెస్టుల్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విఫలమయ్యారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్, కోహ్లీ (Rohit vs Virat) తమ స్థాయిని మర్చిపోయి ఆడినట్లు కనిపించింది. దీంతో వాళ్ళ రీటైర్మెంట్ పై వార్తలు వెల్లువెత్తాయి. మాజీలు సైతం వీళ్ళిద్దర్నీ టెస్ట్ ఫార్మేట్ కు వీడ్కోలు పలకాలని సూచించారు. అయితే భవిష్యత్తు క్రికెట్ బాగుండాలంటే రోహిత్ కోహ్లీని టెస్టుల్లో ఆడించాలని బీసీసీఐ భావిస్తుంది.
రోహిత్, కోహ్లీ ఇప్పటికే టి20లకు రిటైర్మెంట్ ఇవ్వడంతో టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇస్తే కీలక టోర్నీలలో వాళ్ళకి ప్రాక్టీస్ ఇబ్బంది అవుతుందని బీసీసీఐ భావిస్తుంది. ఈ నేపథ్యంలో రోహిత్ కోహ్లీలను దేశవాళీ టోర్నీలలో ఆడించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 128 మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 49.39 సగటుతో 9827 పరుగులు చేశాడు.ఇందులో 29 సెంచరీలు మరియు 38 హాఫ్ సెంచరీలు సాధించాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో అతని ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది. అతను 336 మ్యాచ్‌ల్లో 46.81 సగటుతో 13108 పరుగులు చేశాడు.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రపంచ ఛాంపియన్ జట్టు తంటాలు
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 155 మ్యాచ్‌ల్లో 48.23 సగటుతో 11479 పరుగులు చేశాడు. ఇందులో 37 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. లిస్ట్ ఎ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 329 మ్యాచ్‌ల్లో 57.05 సగటుతో 15348 పరుగులు చేశాడు. కాగా దుబాయ్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియాకు సవాలుగా మారింది. ఈ ట్రోఫీని పాక్ నిర్వహిస్తుండగా భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి. ఈ టోర్నీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై టీమిండియా భారీ అంచనాలు పెట్టుకుంది. రోహిత్, కోహ్లీకి చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన అనుభవం ఎక్కువగా ఉండటంతో గంభీర్ కూడా రోకో విషయంలో పటిష్ట ప్రణాళికలు రచిస్తున్నాడు.