Rohit Sharma: రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో భారత జట్టును నడిపించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. బీసీసీఐ ఈ పర్యటన కోసం దాదాపు 35 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియాతో ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీపై కొన్ని చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు అతను కెప్టెన్‌గా కొనసాగుతాడని ఆశాభావం వ్యక్తం అవుతోంది.
ఓ నివేదిక ప్రకారం.. జట్టు సెలెక్టర్లు మిడిల్ ఆర్డర్ (నంబర్ 5 లేదా 6)లో స్థిరంగా ఆడగల బ్యాట్స్‌మన్ కోసం బీసీసీఐ వెతుకుతున్నట్లు తెలిపారు. ఈ స్థానం కోసం కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్, పాటిదార్ అత్యంత బలమైన ఆటగాళ్లుగా పరిగణించబడుతున్నారు. అయితే, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌లను ఇప్పటివరకు సెలెక్టర్ల జాబితాలో చేర్చలేదు.
పెద్ద సమాచారం వెల్లడి
బీసీసీఐ వర్గం ఒకటి ఇలా తెలిపింది. “రోహిత్ శర్మ ఈ పర్యటనకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ కఠినమైన సిరీస్ కోసం బలమైన కెప్టెన్ అవసరమని బోర్డు భావిస్తోంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియా పర్యటన లాంటి సవాలుతో కూడుకున్నది కావచ్చు.” అని పేర్కొంది.
మిడిల్ ఆర్డర్ గురించి తెలియజేస్తూ.. “టీమ్ మేనేజ్‌మెంట్‌కు సర్ఫరాజ్ ఖాన్ సామర్థ్యంపై పెద్దగా నమ్మకం లేదు. అయితే కరుణ్ నాయర్, రజత్ పాటిదార్ (టెస్ట్ క్రికెట్)లో మంచి, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు,. ప్రస్తుతం మంచి ఫామ్‌లో కూడా ఉన్నారు. వీరిలో కనీసం ఒకరు భారత్ ‘ఎ’ జట్టులో భాగం కావచ్చు.” అని వెల్లడించారు. శ్రేయస్ అయ్యర్ గురించి వారు ఇలా అన్నారు. “గత సంవత్సరం టెస్ట్‌లో అతని పేలవమైన ప్రదర్శన కారణంగా అతన్ని జట్టు నుండి తొలగించారు. ప్రస్తుతానికి దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు.” అని పేర్కొన్నారు.
Also Read: Amit Shah: “ఇది మోదీ ప్రభుత్వం”.. ఉగ్రవాదులకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్!
సాయి సుదర్శన్‌కు కూడా అవకాశం లభించవచ్చు
సాయి సుదర్శన్‌ను ఈ టెస్ట్ సిరీస్ కోసం బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేయవచ్చు. అతను మెయిన్ టీమ్‌లో స్థానం సంపాదించకపోతే భారత్ ఎ జట్టులో ఖచ్చితంగా భాగమవుతాడు. షార్ట్‌లిస్ట్‌లో మరో పెద్ద పేరు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. విదేశీ టెస్ట్ మ్యాచ్‌లలో అతనికి ఇప్పటివరకు జట్టులో అవకాశం లభించలేదు. కానీ ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలో ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, కుల్దీప్‌ను దూకుడైన స్పిన్నర్‌గా చూస్తున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విషయానికొస్తే మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఖాయంగా ఉంటారని భావిస్తున్నారు. అయితే, మహమ్మద్ సిరాజ్ అస్థిర ప్రదర్శనపై సెలెక్టర్లు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.