IND vs AFG: రోహిత్ పరుగుల వరద..121 పరుగులతో విధ్వంసం

IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు బెంగుళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ మరోసారి తన బ్యాటింగ్ ప్రతాపం చూపించాడు. కేవలం 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ సెంచరీతో రోహిత్ అంతర్జాతీయ టీ20ల్లో ఐదో శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో సూర్య‌కుమార్ యాద‌వ్‌, గ్లెన్ మాక్స్‌వెల్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. పొట్టి ఫార్మెట్లో సూర్య 4 సెంచరీలు, గ్లెన్ మాక్స్‌వెల్ 4 సెంచరీలు నమోదు చేశారు.

టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రోహిత్ శర్మ, రింకు సింగ్ కలిసి ఆదుకున్నారు. అగ్నికి వాయువు తోడైనట్టు రోహిత్ శర్మకు రింకూ సింగ్ జతకలవడంతో టీమిండియా స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. రోహిత్ సెంచరీతో విధ్వంసం సృష్టిస్తే మరో ఎండ్ లో 39 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్సర్లతో 69 పరుగులు చేసి రింకు సింగ్ అజేయంగా నిలిచాడు.

తొలి రెండు మ్యాచ్ ల్లో రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. చివరి మ్యాచ్ లో మాత్రం ఊచకోత కోశాడు. ఓ దశలో రోహిత్ క్రీజులో ఉన్నప్పుడు ఎలాంటి బౌలింగ్ చేయాలో అర్ధం కాక ఆఫ్ఘన్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. ఓ దిక్కు రోహిత్ విధ్వంసానికి రింకు బ్యాటింగ్ ఝళిపిస్తుండటంతో స్టేడియం హోరెత్తింది.

Also Read: IND vs AFG: రోహిత్ పరుగుల వరద..121 పరుగులతో విధ్వంసం