- విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌పై భారీ అంచనాలు
- ముంబై జట్టులో రోహిత్ శర్మ పేరు మాయం
- కారణం చెప్పిన ముంబై క్రికెట్ అసోసియేషన్
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ కోసం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ టోర్నమెంట్‌లో ఆడుతూ కనిపించబోతున్నారు. తమ ఆటగాళ్లందరూ ఖచ్చితంగా దేశీవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని రోహిత్ శర్మ ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు ఇప్పటికే సమాచారం అందించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విజయ్ హజారే ట్రోఫీ కోసం ప్రకటించిన ముంబై జట్టులో రోహిత్ శర్మతో పాటు మరికొందరు కీలక ఆటగాళ్ల పేర్లు లేవు. ఇది రోహిత్ ఈ టోర్నీ ఆడటంపై సందిగ్ధతను పెంచింది.
ముంబై జట్టు ఎంపికపై సస్పెన్స్
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే వంటి స్టార్ ఆటగాళ్లకు ముంబై జట్టులో చోటు దక్కలేదు. అయితే దీని అర్థం వారు దేశీవాళీ క్రికెట్‌కు దూరం కాబోతున్నారని కాదు. దీనిపై ముంబై సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సంజయ్ పాటిల్ స్పందిస్తూ.. “ఈ ఆటగాళ్లందరూ అందుబాటులోకి వచ్చిన తర్వాత జట్టులో చేరుతారు. వారు అందుబాటులో లేనప్పుడు వారిని జట్టులో ఉంచి, మరో యువ ఆటగాడిని పక్కన పెట్టడం సరైనది కాదు” అని తెలిపారు.
Also Read: ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!
యశస్వి జైస్వాల్ పునరాగమనంపై అప్‌డేట్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో కడుపు సంబంధిత సమస్యతో యశస్వి జైస్వాల్ పుణెలోని ఆసుపత్రిలో చేరారు. ఆయన పునరాగమనం గురించి సంజయ్ పాటిల్ అప్‌డేట్ ఇస్తూ.. “మెడికల్ టీమ్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే జైస్వాల్ ముంబై జట్టులోకి వస్తారు” అని చెప్పారు. జైస్వాల్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. విజయ్ హజారే ట్రోఫీ ఆయనకు చాలా కీలకం. ఇక్కడ రాణించడం ద్వారా టీమ్ ఇండియా వన్డే జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు.
తొలి మ్యాచ్‌లకు అజింక్యా రహానే దూరం
భారత మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్యా రహానే కూడా విజయ్ హజారే ట్రోఫీలో కొన్ని ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. “రహానేకు హ్యామ్‌స్ట్రింగ్ సమస్య ఉంది. అందుకే ఆయనకు విశ్రాంతి అవసరం. మరికొన్ని మ్యాచ్‌ల తర్వాత ఆయన ముంబై జట్టుతో చేరుతారు” అని సంజయ్ పాటిల్ వివరించారు.
