Rohit Sharma: క్రికెట్ కిట్ కోసం పాల ప్యాకెట్లు డెలివరీ.. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా?

మన దేశంలో క్రికెట్ మతమైతే క్రికెటర్లు దేవుళ్ళులా అభిమానిస్తారు...ఒక్కసారి జాతీయ జట్టులో చోటు దక్కిందంటే ఆ ప్లేయర్ రాత మారినట్టే. ఒక మంచి ఇన్నింగ్స్..

  • Written By:
  • Publish Date - March 28, 2023 / 03:35 PM IST

Rohit Sharma : మన దేశంలో క్రికెట్ మతమైతే క్రికెటర్లు దేవుళ్ళులా అభిమానిస్తారు.. ఒక్కసారి జాతీయ జట్టులో చోటు దక్కిందంటే ఆ ప్లేయర్ రాత మారినట్టే. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే సెలబ్రిటీ అయిపోతారు. ఇక స్టార్ డమ్ కు కొదవ ఉండదు. అయితే టీమిండియాలో ఆడుతున్న క్రికెటర్లలో చాలా మంది మిడిల్ క్లాస్, అంతకంటే కింది స్థాయి నుంచి వచ్చినవారే. ఒకప్పుడు క్రికెట్ కిట్ కొనేందుకు కూడా ఇబ్బంది పడినవారూ ఉన్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా ఉన్న వ్యక్తి క్రికెట్ కిట్ కొనేందుకు పాల ప్యాకెట్లు వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని భారత మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా వెల్లడించాడు. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). తాజాగా ఓ ఇంటర్యూలో ప్రగ్యాన్ ఓజా ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

రోహిత్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడని, అండర్ 15 స్థాయిలో కోచింగ్ తీసుకునేటప్పుడు క్రికెట్ కిట్ కోసం పాల ప్యాకెట్లు వేసేవాడని, ఈ విషయం తనతో పంచుకున్నాడంటూ ఓజా చెప్పాడు. చాలా ఏళ్ళ కిందట ఇది జరిగినా అతను ఏ స్థాయి నుంచి ఎంత కష్టపడి ఇప్పుడు భారత జట్టు కెప్టెన్ అయ్యాడో చూడొచ్చన్నాడు. రోహిత్ కెరీర్ యువక్రికెటర్లకు చక్కని స్ఫూర్తినిస్తుందన్నాడు. ఫిట్ నెస్, ఫామ్ కోల్పోయినప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మళ్ళీ జట్టులోకి తిరిగి వచ్చాడన్నాడు. రంజీ ట్రోఫీ కెరీర్ సమయంలోనూ, ఐపీఎల్ ఆడుతున్నప్పుడు రోహిత్ ను మరింత దగ్గరగా గమనించానని ఓజా గుర్తు చేసుకున్నాడు. అండర్ 19 క్రికెట్ ఆడుతున్నప్పుడూ రోహిత్ ఎంతో దూకుడుగా ఉండేవాడని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణాన్ని ఉత్సాహంగా ఉంచేందుకు రోహిత్ ప్రాంక్స్ చేసే వాడని ఓజా చెప్పాడు. వేరే వాళ్ళ వాయిస్ లను చాలా బాగా అనుకరించేవాడని, పలు సందర్భాల్లో తన మిమిక్రీతోనే చాలా మందిని ఆటపట్టించిన విషయాన్ని కూడా ఓజా గుర్తు చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం రోహిత్ శర్మ తన ముంబై ఇండియన్స్ సహచరులతో ఐపీఎల్ 16వ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సీజన్ లో ముంబై తన తొలి మ్యాచ్ లో ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

Also Read:  Healthy Sleep Tips: 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే PAD ముప్పు.. ఏమిటది..?