Site icon HashtagU Telugu

Ranji Trophy: పిచ్ మాత్ర‌మే మారింది.. మన స్టార్ ఆట‌గాళ్ల ఆట కాదు!

Ranji Trophy

Ranji Trophy

Ranji Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ రోజురోజుకు దగ్గరవుతోంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే టోర్నీలో 130 కోట్ల మంది భారతీయులు తమ స్టార్ ప్లేయర్‌లపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. టీ20 ప్రపంచకప్ మాదిరిగానే భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కూడా వస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ వరుసగా ఆట‌గాళ్ల ఫామ్, భారత బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ల ఫ్లాప్ షో కొనసాగుతోంది. ప్ర‌స్తుతం దేశవాళీ క్రికెట్‌లో కూడా టీమిండియా స్టార్లు పరుగుల కోసం పాకులాడుతున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన భారత జట్టులోని టాప్-5 బ్యాట్స్‌మెన్ గురువారం (జనవరి 23) రంజీ పోరులో (Ranji Trophy) అడుగుపెట్టారు. ఈ ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లో ఒక్క బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగాడు. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు కలిసి మొత్తం 23 పరుగులు చేశారు.

Also Read: Weather: రిపబ్లిక్ డే వరకు.. తెలంగాణ‌కు వాతావరణ శాఖ కీలక అలర్ట్!

దేశవాళీ క్రికెట్‌లో భారత స్టార్లు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌

జనవరి 23 నుంచి ప్రారంభమైన రంజీ ట్రోఫీ రెండో రౌండ్‌లో ముంబయి వర్సెస్ జమ్మూకశ్మీర్ మ్యాచ్‌పైనే అందరి చూపు పడింది. చాలా కాలం తర్వాత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్‌లోకి పునరాగమనం చేయడమే ఇందుకు కారణం. రోహిత్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ రోహిత్ ప‌రుగులు చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. 19 బంతులు ఆడిన రోహిత్ 3 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. కంగారూ గడ్డపై ఫామ్‌లో కనిపించిన యశస్వి జైస్వాల్ కూడా నిరాశ‌ప‌రిచి కేవలం 4 పరుగులు చేసి పెవిలియన్ బాట ప‌ట్టాడు.

గిల్-పంత్ కూడా పేల‌వ ఫామ్‌

పంజాబ్‌కు ఆడుతున్న శుభమాన్ గిల్ ఫామ్ కూడా ఇలాగే ఉంది. గిల్ కేవలం 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఇదే సమయంలో ఢిల్లీకి ఆడేందుకు వచ్చిన రిషబ్ పంత్ అతికష్టమ్మీద ఖాతా తెరిచి ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దేశవాళీ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయాస్ అయ్యర్ కూడా 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను టీమ్ ఇండియా గెలవడానికి సహాయపడే బాధ్యత ఈ ఐదుగురు బ్యాట్స్‌మెన్‌పై ఉంది. మ‌రీ ఇలాంటి ఫామ్‌తో ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఈ ఆట‌గాళ్లు ఎలా రాణిస్తారో చూడాలి.