Rishabh Pant Injury: భారత్- ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌లో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ (జూలై 10) మొదటి రోజు భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ (Rishabh Pant Injury) మైదానంలో గాయపడ్డాడు. ఆట మధ్యలో వదిలి బయటకు వెళ్లవలసి వచ్చింది. అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌ను సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్‌గా పిలిచారు. అయితే, ధ్రువ్ జురెల్ పంత్ స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగలడా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పంత్‌కు గాయం ఎలా అయింది?
లార్డ్స్ టెస్ట్ మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 34వ ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రా వేసిన వైడ్ బౌన్సర్‌ను అడ్డుకునే ప్రయత్నంలో పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి బంతి తాకింది. ఆ తర్వాత అతను తీవ్రమైన నొప్పితో కనిపించాడు. ఫిజియో మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించాడు. పంత్ కొంత సమయం ఆటను కొనసాగించాడు. అయితే, నొప్పి పెరగడంతో 35వ ఓవర్‌లో అతను మైదానం విడిచి వెళ్లాడు. తిరిగి వికెట్ కీపింగ్ చేయలేకపోయాడు.
పంత్ బయటకు వెళ్లిన తర్వాత, యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌కు వికెట్ కీపింగ్ బాధ్యత అప్పగించారు. అతను గ్లోవ్స్ ధరించి పంత్ స్థానంలో మైదానంలోకి దిగాడు. 50వ ఓవర్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ ఒలీ పోప్‌ను అద్భుతమైన క్యాచ్ ద్వారా ఔట్ చేసి భారత్‌కు కీలక విజయాన్ని అందించాడు.
Also Read: Changur Baba : ఛాంగుర్ బాబా ఎవరు? ఇతడిపై ఈడీ ఎందుకు కేసు పెట్టింది?
ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేయగలడా?
సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ధ్రువ్ జురెల్ పంత్ స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగలడా? దీనికి సమాధానం “లేదు”. మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (MCC) నియమం 24.1.2 ప్రకారం.. ఏ సబ్‌స్టిట్యూట్ ఆటగాడూ బౌలింగ్ లేదా కెప్టెన్సీ చేయలేడు. అతను కేవలం అంపైర్ల అనుమతితో వికెట్ కీపింగ్ చేయడానికి మాత్రమే అర్హుడు. ఈ నియమం ప్రకారం.. ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ మాత్రమే చేయగలడు. కానీ బ్యాటింగ్ చేయలేడు. ఒకవేళ పంత్ ఈ టెస్ట్ మ్యాచ్ మిగిలిన భాగాల్లో మైదానంలోకి తిరిగి రాకపోతే, భారత జట్టు ఒక బ్యాట్స్‌మన్ తక్కువతోనే మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
సబ్‌స్టిట్యూట్ ఆటగాడు బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడానికి అనుమతించబడే ఏకైక సందర్భం కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్. అంటే ఆటగాడి తలకు గాయం కావడం. పంత్‌కు వేలిలో గాయం కావడం వల్ల ఈ నియమం ఇక్కడ వర్తించదు. పంత్ గాయం తర్వాత భారత జట్టు ముందు ఒక పెద్ద సవాలు ఉంది. పంత్ రెండవ రోజు ఆడకపోతే ఆ కొరతను ఎలా భర్తీ చేయాలి? అనే ప్రశ్న మొదలైంది.
BCCI ఏమి చెప్పింది?
పంత్ గాయం తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారిక అప్‌డేట్ విడుదల చేసింది. “టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. అతను ప్రస్తుతం మెడికల్ బృందం పర్యవేక్షణలో ఉన్నాడు” అని BCCI ఈ అప్‌డేట్‌ను ఎక్స్‌లో కూడా పంచుకుంది. పంత్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు, రెండవ రోజు ఉదయం (జూలై 11) నాటికి మరింత స్పష్టత వస్తుందని తెలిపింది.