CWG 2022: ఫ్లాగ్ బేరర్ గా తెలుగు తేజం… ఐఓఏకు సింధు కృతజ్ఞతలు

బర్మింగ్ హామ్ వేదిక కామన్ వెల్త్ గేమ్స్ నేటి నుంచే ఆరంభం కానున్నాయి. 72 దేశాలకు చెందిన 5 వేల మందికి పైగా క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్ లో పాల్గొంటున్నారు.

  • Written By:
  • Publish Date - July 28, 2022 / 10:13 AM IST

బర్మింగ్ హామ్ వేదిక కామన్ వెల్త్ గేమ్స్ నేటి నుంచే ఆరంభం కానున్నాయి. 72 దేశాలకు చెందిన 5 వేల మందికి పైగా క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్ లో పాల్గొంటున్నారు. భారత్ కూడా భారీ బృందంతో అక్కడికి చేరుకుంది. గురువారం జరిగే ఆరంభ వేడుకల కోసం ఆతిథ్య దేశం భారీగానే ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే
స్టార్‌ షట్లర్‌, హైదరాబాదీ పీవీ సింధు కామన్వెల్త్‌ గేమ్స్‌ ఓపెనింగ్‌ సెర్మనీలో త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకొని ముందు నడవనుంది. ఈ గౌరవం ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రాకు దక్కుతుందా లేక సింధుకా అన్న ప్రశ్న ఒక రోజు ముందు వరకూ తలెత్తింది. అయితే గాయం కారణంగా నీరజ్‌ చోప్రా ఈ గేమ్స్‌కు దూరం కావడంతో ఆ అవకాశం సింధుకి దక్కింది. ఈ విషయాన్ని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.
ఈసారి గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌పై ఆశలు రేపుతున్న వారిలో పీవీ సింధు కూడా ముందువరుసలో ఉంది. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో సింధు బ్రాంజ్‌ మెడల్‌ గెలిచింది. అంతకుముందు రియో ఒలింపిక్స్‌లో ఆమె సిల్వర్‌ సొంతం చేసుకుంది. గత కామన్వెల్త గేమ్స్‌ సింగిల్స్‌లో సిల్వర్‌ మెడల్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్‌ను సింధు గెలుచుకుంది.
కాగా ఫ్లాగ్ బేరర్ గా అవకాశం రావడంపై సింధు స్పందించింది. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని ఆమె చెప్పింది. టీమ్‌ను ముందుండి లీడ్‌ చేయడం, త్రివర్ణ పతాకాన్ని పట్టుకునే బాధ్యత తనకు అప్పగించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ,  చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించింది. గేమ్స్‌లో పాల్గొంటున్న ఇండియన్‌ టీమ్‌ మొత్తానికి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పిన సింధు ఫ్లాగ్‌ బేరర్‌గా తనను ఎంపిక చేసినందుకు ఐఓఏకు కృతజ్ఞతలు తెలిపింది.కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022 ఓపెనింగ్‌ సెర్మనీ గురువారం రాత్రి బర్మింగ్‌హామ్‌లోని అలెగ్జాండర్‌ స్టేడియంలో జరగనుంది.