వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వసీజన్ (IPL 2025 ) పై రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. జెడ్డా వేదికగా ఇటీవలే మెగావేలం ముగిసింది. దీంతో ఏ ఆటగాడు ఏ జట్టుకు ఆడతాడో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకు పదిహేడు ఐపీఎల్ సీజన్లు ముగిసాయి. ముంబై, చెన్నై తలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచాయి. అయితే ఆ రెండు జట్ల కంటే కోట్లాదిమంది అభిమానులు ఆరాధించే ఆర్సీబీ మాత్రం టైటిల్ కోసం పోరాటం చేస్తూనే ఉంది. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది. ఆ జట్టులో కోహ్లీ ఉన్నన్నాళ్ళు ఆర్సీబీకి ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది. ఫ్యాన్స్ కోసమైనా వచ్చే సీజన్లో టైటిల్ గెలవాలనుకుంటుంది.
వేలంలో ఆర్సీబీ (RCB) వ్యవహరించిన తీరుపై తొలుత విమర్శలు వచ్చినప్పటికీ యాజమాన్యం మాత్రం ఆచితూచి ఆటగాళ్లను దక్కించుకున్నట్టు అర్ధమవుతుంది. విరాట్ కోహ్లీ(Virat Kohli)ని 21 కోట్లకు , రజిత్ పాటిదార్(Rajat Patidar) ను11 కోట్లకు తీసుకుంది. వీరిద్దరూ బ్యాటింగ్ కు మూల స్తంభంగా ఉంటారు. ఇక బౌలింగ్ పరంగా యష్ దయాల్ ను 5 కోట్లకు కైవసం చేసుకుంది. అయితే పాటిదార్ ఎందుకంత విలువైన ఆటగాడో తాజాగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ఫైనల్ మ్యాచ్ చూస్తే అర్ధమవుతుంది. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్ జట్టుకు పాటిదార్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ఫైనల్లో ముంబై గెలిచి టైటిల్ ఎగురేసుకుపోయినప్పటికీ పాటిదార్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ తో రఫ్ఫాడించాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాది స్కోరుబోర్డును ఉరకలెత్తించాడు. చివరి రెండు ఓవర్లలో సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. అయితే అతని పోరాటం వృధాగా మిగిలిపోయింది.
మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేయగా ముంబయి 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ టోర్నీలో సత్తా చాటితే రజిత్ పాటిదార్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఆర్సీబీ ముందునుంచి అనుకుంది. ఆర్సీబీ నమ్మకాన్ని పాటిదార్ వమ్ము చేయకుండా మధ్యప్రదేశ్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. అతని సహకారం వల్లనే జట్టు ఫైనల్ కు చేరింది. ఫైనల్లోనూ పాటిదార్ జట్టును అద్భుతంగా నడిపించాడు. టైటిల్ గెలవకపోయినా పాటిదార్ ప్రదర్శనకు ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. అన్నీ కుదిరితే పాటిదార్ ఆర్సీబీకి తదుపరి కెప్టెన్ కావొచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
Read Also : Gold Price Today : స్థిరంగా బంగారం ధరలు..!