Rajat Patidar: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోసం ఎదురుచూస్తుంది. డుప్లిసిస్ ని వదులుకున్న ఆర్సీబీ గత ఐపీఎల్ వేలంలోను కెప్టెన్ మెటీరియల్ ను కొనుగోలు చేయలేకపోయింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆందోళన చెందాల్సి వచ్చింది. భారీ హిట్టర్లను వదులుకుని సాధారణ ప్లేయర్లను తీసుకుందని సోషల్ మీడియా వేదికగా యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆయా లీగ్, స్వదేశీ టోర్నీలలో ఆర్సీబీ ఆటగాళ్ల ప్రదర్శనను గమనిస్తే ఆర్సీబీకి కెప్టెన్ సమస్య తీరినట్టుగానే కనిపిస్తుంది.
విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్, మధ్యప్రదేశ్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ (Rajat Patidar) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బెంగాల్ ఇచ్చిన 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెంచరీతో ఊచకోత కోశాడు. విశేషమేమిటంటే తన జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో రజత్ సెంచరీ సాధించాడు. ఓపెనర్లిద్దరూ ఖాతా తెరవకుండానే ఔటయ్యారు.ఈ క్రమంలో జట్టు బాధ్యతను తీసుకున్న పాటిదార్ 125 బంతుల్లో సెంచరీని పూర్తి చేసి, ఆపై 137 బంతులను ఎదుర్కొన్నాడు. 8 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 132 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ మధ్యప్రదేశ్‌కు విజయాన్ని అందించడమే కాకుండా, ఆర్సీబీ కెప్టెన్‌గా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నాడు. మరోవైపు ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ కూడా పాటీదార్ పై ఓ కన్నేసి ఉంచింది.
Also Read: Chahal Viral Video: తప్పతాగిన యుజ్వేంద్ర చాహల్.. వీడియో వైరల్
31 ఏళ్ల రజత్ పాటిదార్ ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 2021, 2022 మరియు 2024లో ఆడిన మొత్తం 27 మ్యాచ్‌లలో పాటిదార్ 158 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 799 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ,7 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. అతని టాప్ స్కోరు 112 పరుగులు నాటౌట్. ఐపీఎల్ చరిత్రలో క్వాలిఫయర్స్‌లో సెంచరీ చేసిన తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా నిలిచాడు.
ఆర్సీబీ జట్టు: విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, యశ్ దయాల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, జాకబ్ బెతేల్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, దేవ్‌దత్ , స్వస్తిక్ చికారా, మనోజ్ భాంగే, లుంగి ఎన్గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠీ.