world cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ కు మరో ఓటమి… ఇంగ్లాండ్ పై సఫారీల భారీ విజయం

వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఘోరమైన ఆటతీరుతో ఇంగ్లాండ్ ఓడిపోతోంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లీష్ టీమ్ 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

Published By: HashtagU Telugu Desk
World Cup 2023 (44)

World Cup 2023 (44)

world cup 2023: వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఘోరమైన ఆటతీరుతో ఇంగ్లాండ్ ఓడిపోతోంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లీష్ టీమ్ 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన సఫారీ బ్యాటర్లు దంచికొట్టారు. బౌండరీలు, సిక్సర్లతో వాంఖేడే స్టేడియాన్ని హోరెత్తించారు. హెన్రీచ్ క్లాసెన్ విధ్వంసకర శతకంతో రెచ్చిపోయాడు. అలాగే హెండ్రిక్స్ , డస్సెన్ , జాన్సెన్ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. వీరందరి బ్యాటింగ్ ఒక్క ఎత్తయితే… క్లాసెన్ బ్యాటింగ్ ఒక్కటే మరో ఎత్తు. ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న క్లాసెన్ కేవలం 67 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. ముంబైలో వేడికి తట్టుకోలేకపోయిన క్లాసెన్ ఇబ్బంది పడుతూనే భారీ షాట్లతో అలరించాడు.హెండ్రీక్స్ 75 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 85, డస్సెన్ 61 బంతుల్లో 8 ఫోర్లతో 60, జాన్సెన్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేశారు. వీరందరి జోరుతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. సఫారీ బ్యాటర్ల దెబ్బకు ఇంగ్లీష్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో టోప్లీ మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, అట్కిన్సన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.

వాంఖేడే పిచ్ ఛేజింగ్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనుకున్న ఫ్యాన్స్ కు ఇంగ్లాండ్ నిరాశ కలిగించింది. ఏ దశలోనూ పోటీ ఇవ్వకుండా చేతులెత్తేసింది. 22 ఓవర్లలో కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. అసలు ఆడుతుంది ఇంగ్లాండ్ జట్టేనా అన్న రీతిలో వారి ఆటతీరు సాగింది.
కోయిట్జ్ మూడు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి , మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీసారు. కగిసో రబడా, కేశవ్ మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో మార్క్‌వుడ్ 43 , అట్కిన్సన్ 35 రన్స్ తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికాకు ఇది మూడో విజయం. మరోవైపు ఇంగ్లాండ్ కు వన్డేల్లో అత్యంత ఘోర పరాభవం ఇదే. అలాగే ఈ టోర్నీలో ఇంగ్లీష్ టీమ్ కు ఇది మూడో ఓటమి. తాజా పరాజయంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు తొమ్మిదో స్థానానికి పడిపోయింది. చిన్న జట్లు సంచలనాలు సృష్టిస్తున్న వేళ ఇంగ్లాండ్ కు తర్వాతి మ్యాచ్ లన్నీ కీలకం కానున్నాయి.

Also Read: Sridevi Diet : శ్రీదేవి పాటించిన డైట్ ఎంత ప్రమాదకరమైనదో మీకు తెలుసా? మీరు మాత్రం అలా చేయకండి..

  Last Updated: 21 Oct 2023, 10:58 PM IST