DPLT20: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు అనగానే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో యువరాజ్ విధ్వంసమే గుర్తొస్తుంది. ఈ మధ్య కాలంలో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల రికార్డు అప్పుడప్పుడూ నమోదవుతూనే ఉంటోంది. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీలో ప్రియాన్ష్ ఆర్యా చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదేశాడు. నార్త్ ఢిల్లీ స్పిన్నర్ మనన్ భరద్వాజ్ వేసిన 12 ఓవర్‌లో ఆరు బంతుల్ని స్టాండ్స్‌కు తరలించాడు. ప్రియాన్ష్ ఈ మ్యాచ్ లో 50 బంతుల్లోనే 120 పరుగులు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్న ఈ యువ క్రికెటర్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 10 సిక్సర్లున్నాయి.
అతనితో పాటు ఆయుష బదౌనీ కూడా సెంచరీ చేయడంతో సౌత్ ఢిల్లీ ఏకంగా 300 ప్లస్ స్కోర్ అందుకుంది. కాగా 23 ఏళ్ల ప్రియాన్ష్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ లీగ్‌లో గత ఏడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అతని ఇన్నింగ్స్ లు చూస్తే వరుసగా 30 బంతుల్లో 57 , 51 బంతుల్లో 82 , 32 బంతుల్లో 53 , 26 బంతుల్లో 45 , 55 బంతుల్లో 107 , 42 బంతుల్లో 88 , 9 బంతుల్లో 24 , 50 బంతుల్లో 120 పరుగులు చేశాడు. అండర్ 19 స్థాయి నుంచి నిలకడగా రాణిస్తున్న ప్రియాన్ష్ బ్యాటింగ్ కు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీ మంచి వేదికగా నిలుస్తోంది. తాజా ప్రదర్శనలతో డిసెంబర్ లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో ప్రియాన్ష్ ఆర్యాపై కోట్ల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు.
Also Read: Helicopter Missing : అగ్నిపర్వతం సమీపంలో 22 మందితో ఉన్న హెలికాప్టర్ మిస్టింగ్..