PBKS vs KKR: ముల్లాన్‌పూర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్కంఠ అంటే ఏమిటో అక్కడికి వచ్చిన ప్రేక్షకులు రుచి చూశారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. బదులుగా కోల్‌కతా నైట్ రైడర్స్ (PBKS vs KKR) 95 పరుగులకే కుప్పకూలింది. సాధారణంగా ఈ మైదానంలో హై-స్కోరింగ్ మ్యాచ్‌లు కనిపిస్తాయి. కానీ పంజాబ్ బౌలింగ్ యూనిట్, చిన్న లక్ష్యం ఉన్నప్పటికీ కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌లను చెమటలు పట్టించింది.
కేకేఆర్ బ్యాటింగ్ ఆరంభం దారుణం
112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభం చాలా దారుణంగా సాగింది. కేవలం 7 పరుగుల వద్ద ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. క్వింటన్ డి కాక్ 2 పరుగులు, సునీల్ నరైన్ 5 పరుగులతో ఔటయ్యారు. ఈ తక్కువ స్కోరు మ్యాచ్‌లో అంగకృష్ రఘువంశీ, కెప్టెన్ అజింక్య రహానేలు 55 పరుగుల భాగస్వామ్యంతో కేకేఆర్ విజయంపై ఆశలు రేకెత్తించారు. రఘువంశీ 37 పరుగులతో కేకేఆర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే రహానే 17 పరుగులు చేశాడు. వీరి భాగస్వామ్యం కేకేఆర్‌కు కొంత ఊరటనిచ్చినప్పటికీ ఆ తర్వాత వచ్చిన పతనం జట్టును కుదేలు చేసింది.
Also Read: National Herald Case : సోనియా, రాహుల్‌లపై ఈడీ ఛార్జ్‌షీట్.. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం
7 పరుగుల్లో 5 వికెట్లు కోల్పోయిన కేకేఆర్
112 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఒక దశలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. కానీ అంగకృష్ రఘువంశీ ఔట్ కావడంతో పతనం మొదలైంది. ఆపై కేవలం 7 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో వెంకటేష్ అయ్యర్ (7 పరుగులు), రింకూ సింగ్ (2 పరుగులు), రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రానా వంటి కీలక బ్యాట్స్‌మెన్‌లు వరుసగా ఔటయ్యారు. రింకూ సింగ్‌పై భారీ స్కోరు అంచనాలున్నప్పటికీ, అతను నిరాశపరిచాడు. ఈ పతనం కేకేఆర్‌ను విజయ దారిలో వెనక్కి నెట్టింది.
యుజ్వేంద్ర చాహల్ మాయాజాలం
కేకేఆర్‌ను చిత్తు చేయడంలో యుజ్వేంద్ర చాహల్ కీలక పాత్ర పోషించాడు. అతను 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అజింక్య రహానే, అంగకృష్ రఘువంశీ వికెట్లను తీసి మ్యాచ్‌ను పంజాబ్ వైపు మళ్లించాడు. అలాగ రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్ వికెట్లను కూడా సాధించాడు. చాహల్ స్పిన్ మాయాజాలం కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌లను అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.
ఈ లో-స్కోరింగ్ థ్రిల్లర్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు ముఖ్యంగా చాహల్, అసాధారణ ప్రదర్శనతో కేకేఆర్‌ను చిత్తు చేశారు. చిన్న లక్ష్యాన్ని కాపాడుకోవడంలో పంజాబ్ విజయం సాధించడం ఆ జట్టు బౌలింగ్ బలాన్ని చాటింది. ముల్లాన్‌పూర్ ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లో ఉత్కంఠను పూర్తిగా అనుభవించారు. ఈ విజయం పంజాబ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది.