Emerging Asia Cup: ఫైనల్లో భారత్ ఎ జట్టు ఓటమి… ఎమర్జింగ్ ఆసియా కప్ విజేత పాకిస్థాన్

భారత్ యువ జట్టు టైటిల్ ముంగిట బోల్తా పడింది. ఎమర్జింగ్ ఆసియా కప్ గెలుద్దామనుకున్న యంగ్ ఇండియా ఆశలు నెరవేరలేదు. టైటిల్ పోరులో సత్తా చాటిన పాక్ 124 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 Emerging Asia Cup: భారత్ యువ జట్టు టైటిల్ ముంగిట బోల్తా పడింది. ఎమర్జింగ్ ఆసియా కప్ గెలుద్దామనుకున్న యంగ్ ఇండియా ఆశలు నెరవేరలేదు. టైటిల్ పోరులో సత్తా చాటిన పాక్ 124 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ యువ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. పాక్ ఆటగాడు తాహిర్ శతక్కొట్టడంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసింది. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత పేసర్ రాజవర్దనే హంగార్గేకర్ చేసిన తప్పిదం పాకిస్థాన్‌కు కలిసొచ్చింది. నాలుగో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ సైమ్ ఆయుబ్‌ క్యాచ్ ఔటైనప్పటికీ అది నోబాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తాహిర్ సెంచరీతో చెలరేగాడు. తాహిర్‌కు తోడుగా ఓపెనర్లు సైమ్ ఆయుబ్ 59, ఫర్హాన్ 65 హాఫ్ సెంచరీలతో చేశారు. భారత బౌలర్లలో రాజవర్దనే హంగార్గేకర్ 2, రియాన్ పరాగ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిశాంత్ సింధు తలో వికెట్ తీసారు.

భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో భారత్ కూడా దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు 8 ఓవర్లలోనే 64 పరుగులు జోడించారు. అయితే మిగిలిన ప్లేయర్లు శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. 61 పరుగులు చేసిన ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మరో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ 29, కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ 39 పరుగులతో పర్వాలేదనిపించారు. టీమిండియా 40 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బౌలర్లలో సుఫియాన్‌ ముఖీమ్‌ 3 వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టాడు.లీగ్ మ్యాచ్ పాక్ ను చిత్తు చేసిన భారత్ ఫైనల్ పోరులో మాత్రం తేలిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది.

Also Read: కార్మికుల సంక్షేమం కాంగ్రెస్‌తోనే – సీఎల్పీ నేత భ‌ట్టి