Pakistan Players: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ అతిథ్యం వహించింది. అయితే టోర్నమెంట్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది. మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఇప్పుడు రాబోయే జాతీయ T20 కప్‌లో పాల్గొనే ఆటగాళ్ల (Pakistan Players) మ్యాచ్ ఫీజును తగ్గించాలని నిర్ణయించింది.
మ్యాచ్ ఫీజులో 75% వరకు తగ్గింపు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) త్వరలో జరగనున్న జాతీయ టీ20 కప్‌లో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును భారీగా తగ్గించింది. ఇప్పుడు టోర్నమెంట్‌లో పాల్గొనే ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు 10,000 పాకిస్థానీ రూపాయలు మాత్రమే ఇవ్వనుంది. ఇది గత సీజన్ కంటే 75% తక్కువ. ఇంతకు ముందు ఈ టోర్నీలో ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.40,000 లభించగా, 2022లో ఈ మొత్తం రూ.60,000గా ఉంది.
కారణం చెప్పిన పీసీబీ
ESPN Cricinfo నివేదిక ప్రకారం.. మ్యాచ్ ఫీజులో కోత విధించడానికి కారణం ఆర్థిక సంక్షోభం కాదని PCB అధికారి స్పష్టం చేశారు. దేశీయ క్యాలెండర్‌లో టోర్నమెంట్‌ల సంఖ్య పెరగడం వల్ల ఆటగాళ్లకు ఎక్కువ సంపాదన అవకాశాలు అందుబాటులోకి వచ్చినట్లు బోర్డు అభిప్రాయపడింది. డిసెంబర్ 2024లో జరిగిన చివరి జాతీయ T20 కప్ కేవలం ఐదు జట్లతో ఆడారు. అయితే చాలా మంది ఆటగాళ్ళు ప్రెసిడెంట్ ట్రోఫీ వంటి ఇతర టోర్నమెంట్‌లలో కూడా పాల్గొంటారు. అక్కడి నుండి వారు నెలవారీ జీతాలు పొందుతారు. మ్యాచ్ ఫీజును తగ్గించినప్పటికీ ఆటగాళ్ల మొత్తం సంపాదనపై పెద్దగా ప్రభావం ఉండదని పీసీబీ భావిస్తోంది.
Also Read: Tulsi Plant: ఆదివారం తులసి మొక్క వద్ద దీపం పెట్టవచ్చా? పెట్టకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
జాతీయ T20 కప్ 2025 మూడు నగరాల్లో నిర్వహించనున్నారు
జాతీయ T20 కప్ 2025 మార్చి 14 నుండి ప్రారంభమవుతుంది. మూడు నగరాల్లో ఫైసలాబాద్, లాహోర్, ముల్తాన్లలో జరుగుతుంది. మొత్తం టోర్నీలో మొత్తం 39 మ్యాచ్‌లు జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ మార్చి 27న ఫైసలాబాద్‌లో జరగనుంది. మరోవైపు ఈ నెలలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ జాతీయ జట్టు బయలుదేరింది.