Pakistan Beats England: ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంది. రెండు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో రెండో మ్యాచ్ ముల్తాన్ స్టేడియంలో జరిగింది. పాకిస్థాన్ 152 పరుగుల తేడాతో విజయం (Pakistan Beats England) సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. పాకిస్థాన్ విజయం తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ పాయింట్ల పట్టికలో కూడా మార్పులు కనిపించాయి. పాక్‌కు కొంత ప్రయోజనం లభించగా, ఇంగ్లండ్ ఓటమితో నష్టపోయింది.
టెస్టు క్రికెట్‌లో వరుస పరాజయాల పరంపరకు పాక్ జట్టు బ్రేక్ వేసింది. షాన్ మసూద్ సారథ్యంలో ముల్తాన్ టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఎట్టకేలకు 11 టెస్టుల తర్వాత స్వదేశంలో పాకిస్థాన్ విజయం సాధించింది. ఈ అద్భుతమైన విజయానికి హీరోలు ఇద్దరు స్పిన్నర్లు నోమన్ అలీ, సాజిద్ ఖాన్. వీరి ముందు ఇంగ్లండ్ జట్టు లొంగిపోయింది. పాకిస్థాన్ 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇంగ్గండ్ జట్టు 144 పరుగులకు ఆలౌట్ అయింది.
Also Read: Jagan Social Media: జగన్ చూపు సోషల్ మీడియా వైపు.. కారణమిదేనా..?
52 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా జరిగింది
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ నోమన్ అలీ 46 పరుగులిచ్చి 8 వికెట్లు తీయగా, ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ మొత్తం 10 వికెట్లు పడగొట్టారు. సాజిద్ 7 వికెట్లు తీయగా, నోమన్ 3 వికెట్లు తీశాడు. ఈ విధంగా వీరిద్దరూ కలిసి 20 వికెట్లు తీశారు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఇద్దరు బౌలర్లు మొత్తం 20 వికెట్లు తీయడం 52 ఏళ్లలో ఇదే తొలిసారి.
1-1తో సిరీస్ సమమైంది
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్టులో పాకిస్థాన్ 152 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో, నిర్ణయాత్మక మ్యాచ్ అక్టోబర్ 24 నుంచి ముల్తాన్‌లో జరగనుంది.