New Zealand Vs Sri Lanka: శ్రీలంక, న్యూజిలాండ్ (New Zealand Vs Sri Lanka) మధ్య జరుగుతున్న 3టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు డారిల్ మిచెల్, మైకేల్ బ్రేస్‌వెల్ విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగుల వరద పారించారు. శ్రీలంక బౌలర్లను చిత్తు చేసిన మిచెల్, మైఖేల్ జోడి కివీస్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. మిచెల్ సాంట్నర్ కివీ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇది అతనికి తొలి మ్యాచ్ కావడం విశేషం.
5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డారిల్ మిచెల్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఒక్కసారిగా క్రీజులో నిలదొక్కుకుని లంక బౌలర్లకు అత్యంత ప్రమాదకరంగా మారాడు. మహిష్ తీక్షణా బంతికి ఔటయ్యే ముందు మిచెల్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అటు మైఖేల్ బ్రేస్‌వెల్ లంక బౌలర్లను ఉతికారేశాడు. బ్రేస్‌వెల్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. అతను ఆరో వికెట్‌కు మిచెల్‌తో కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీని కారణంగా కివీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేయగలిగింది. వీరిద్దరూ తప్ప మరే బ్యాట్స్‌మెన్ రాణించలేదు.
Also Read: Ram Charan Cutout: రామ్ చరణ్ భారీ కటౌట్.. ఎన్ని అడుగులు అంటే?
టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ జట్టును స్వల్ప స్కోరుకే కట్టడి చేయాలన్న తమ ప్రణాళికలు ఫలించలేదు. శ్రీలంక స్టార్ బౌలర్ మతిష్ పతిరనా కూడా కివీ బ్యాటర్లను ఎదుర్కోలేకపోయాడు. ఆ జట్టులో అత్యంత ఖరీదైన బౌలర్ గా రాణిస్తున్న పతిరానా 4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. బినుర ఫెర్నాండో, మహిష్ తీక్షణ, వనిందు హసరంగా తలో 2 వికెట్లు తీశారు. 173 పరుగుల లక్ష్యాన్ని సాధించి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలంటే శ్రీలంక బాగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.