Site icon HashtagU Telugu

Cricketer: క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. హార్ట్ ఎటాక్‌తో బౌలర్ మృతి!

Cricketer

Cricketer

Cricketer: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా బిలారీ బ్లాక్‌లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో సంతోష సమయం ఒక్కసారిగా విషాదంగా మారింది. చివరి బంతి వేసిన వెంటనే పిచ్‌పైనే హార్ట్ ఎటాక్‌తో ఓ బౌలర్ (Cricketer) మరణించారు. ఈ ఆటగాడి మరణంతో మైదానంలో కలకలం రేగింది. అక్కడున్నవారు ఆటగాడిని సీపీఆర్ (CPR) ఇచ్చి కాపాడేందుకు ప్రయత్నించారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు. వైద్యులు ఆ ఆటగాడిని మృతి చెందినట్లు ప్రకటించారు.

మొరాదాబాద్, సంభాల్ మధ్య మ్యాచ్

ఈ మ్యాచ్‌ను యూపీ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించింది. మొరాదాబాద్, సంభాల్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ గెలవడానికి సంభాల్ జట్టుకు చివరి 4 బంతుల్లో 14 పరుగులు అవసరం కాగా.. బంతి అహ్మర్ ఖాన్ చేతిలో ఉంది. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అహ్మర్ ఖాన్ ఈ ఓవర్‌లో కేవలం 11 పరుగులే ఇచ్చి మొరాదాబాద్‌కు విజయాన్ని అందించారు. అయితే కొద్దిసేపటికే ఈ విజయం విషాదంగా మారింది.

Also Read: TTD Calendars: తిరుమ‌ల భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. అందుబాటులో డైరీలు, క్యాలెండర్లు!

అహ్మర్ ఖాన్ ఓవర్‌లోని చివరి బంతిని వేయగానే అతని శ్వాస వేగమైంది. అతను వెంటనే కింద కూర్చుండిపోయాడు. కొద్దిసేపు కూర్చున్న తర్వాత అహ్మర్ ఖాన్ పిచ్‌పై పడిపోయారు. ఇది చూసిన మైదానంలోని ఆటగాళ్లందరూ భయపడ్డారు. వారు అహ్మర్‌ను ర‌క్షించేందుకు ప్రయత్నించి అక్కడే పిచ్‌పై అతనికి సీపీఆర్ ఇచ్చారు. దీంతో కొద్దిగా కదలిక కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ డాక్టర్లు అహ్మర్‌ మృతి చెందినట్లు ప్రకటించారు.

ఈ విషాదకర ఘటన జరిగిన సమయంలో స్థానిక సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే హాజీ మహ్మద్ ఫహీమ్ ఇర్ఫాన్ కూడా అతిథిగా మైదానంలో ఉన్నారు. మరణించిన అహ్మర్ ఖాన్ మొరాదాబాద్‌లోని ఏక్తా విహార్ నివాసి అని తెలిసింది. అతని మరణ వార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని కుటుంబంలో భార్య, ఇద్దరు పిల్లలు, ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు.

Exit mobile version