MI vs PBKS: ముంబైతో పంజాబ్‌ కీలక పోరు.. మొహాలీ వేదికగా ఆసక్తికర మ్యాచ్‌..!

ఐపీఎల్ 16వ సీజన్‌ (IPL 2023)లో సెకండాఫ్ కూడా హోరాహోరీగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే అన్ని జట్లకూ ప్రతీ మ్యాచ్‌ కూడా కీలకమే. ఇవాళ ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది.

  • Written By:
  • Publish Date - May 3, 2023 / 10:30 AM IST

ఐపీఎల్ 16వ సీజన్‌ (IPL 2023)లో సెకండాఫ్ కూడా హోరాహోరీగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే అన్ని జట్లకూ ప్రతీ మ్యాచ్‌ కూడా కీలకమే. ఇవాళ ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. లీగ్ చరిత్రలోనే అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన ముంబై జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ మేజర్ అడ్వాంటేజ్‌. గత రెండు సీజన్లలోనూ ముంబైని సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయలేకపోయిన రోహిత్‌శర్మకు ఈ సారి కూడా మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. సీజన్ ఆరంభంలో ఎప్పటిలానే వరుస పరాజయాలతో సతమతమైన ముంబైని మళ్ళీ గెలుపు బాటలో నడిపిస్తున్నాడు హిట్‌మ్యాన్. అయితే రోహిత్‌ వ్యక్తిగతంగా అంచనాలను అందుకోలేకపోతుండడం నిరాశ కలిగిస్తోంది. ఐపీఎల్‌లో ధోనీ తర్వాత అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన సారథి రోహితే.

కీలక సమయాల్లో బౌలర్లను ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన హిట్‌మ్యాన్‌కు ఈ సీజన్‌ సవాల్‌గా మారింది. ఇప్పటి వరకూ 4 మ్యాచ్‌లు గెలిచిన ముంబై ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకోవాలంటే కెప్టెన్ రోహిత్‌శర్మ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు. మిగిలిన బ్యాటింగ్ లైనప్‌లో ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్‌, సూర్యకుమార్‌, తిలక్ వర్మ , టిమ్ డేవిడ్‌పై అంచనాలున్నాయి. గత మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టగా.. చివర్లో టిమ్ డేవిడ్ మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. దీంతో మరోసారి వీరందరి ఫామే కీలకం కానుంది. బౌలింగ్‌లో ఆర్చర్‌ జట్టులోకి తిరిగి రావడం అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. అర్జున్ టెండూల్కర్‌ను మళ్ళీ తుది జట్టులోకి తీసుకునే అవకాశముండగా.. స్పిన్నర్ పియూష్ చావ్లా రాణిస్తున్నాడు.

Also Read: LSG vs CSK: ఐపీఎల్ లో నేడు చెన్నై, లక్నో జట్ల మధ్య మ్యాచ్.. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి..!

మరోవైపు ముంబై కంటే మెరుగైన స్థానంలో ఉంది పంజాబ్ కింగ్స్‌.. టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ ఇప్పటి వరకూ 5 విజయాలు అందుకుంది. గాయంతో ధావన్ రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా దూరమైనా..శామ్ కరన్ సక్సెస్‌ఫుల్‌గా జట్టును నడిపించాడు. ధావన్‌ మళ్ళీ కోలుకుని ఎంట్రీ ఇవ్వడం ఆ జట్టుకు ప్లస్‌పాయింట్. ఓపెనర్‌గా మంచి ఆరంభాలనే ఇస్తున్న ధావన్‌ ఈ సీజన్‌లో పంజాబ్ తరపున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా సక్సెస్‌ పర్సంటేజీ తక్కువగానే ఉన్నా మంచి ఆల్‌రౌండర్లు జట్టులో ఉండడం ధావన్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ధావన్ వ్యక్తిగత ఫామ్‌, కీలక ఆటగాళ్ళు నిలకడగా రాణిస్తుండడం పంజాబ్‌కు మేజర్ అడ్వాంటేజ్‌. గత మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 200 పైగా టార్గెట్‌ను ఛేదించింది పంజాబ్‌. అదే జోష్‌లో ముంబైని నిలువరించాలని ఎదురుచూస్తోంది. ఈ సీజన్‌లో రెండు జట్లూ తలపడినప్పుడు పంజాబ్‌దే పై చేయిగా నిలిచింది. దీంతో మరోసారి ముంబైని ఓడిస్తామంటున్నాడు ధావన్‌.

ధావన్‌తో పాటు ప్రభ్‌సిమ్రన్‌సింగ్, అధర్వ తైడేతో పాటు లివింగ్‌స్టోన్, సికిందర్‌ రాజాలు కీలకంగా చెప్పాలి. గత మ్యాచ్‌లో శామ్ కరన్, జితేశ్ శర్మ కూడా అదరగొట్టేశారు. అటు బౌలింహ్‌లో రబాడా, అర్షదీప్‌సింగ్‌లు నిలకడగా రాణిస్తుండగా.. స్పిన్‌లో రాహుల్ చాహర్ తన మ్యాజిక్ చూపిస్తున్నాడు. ఇక రెండు జట్ల మధ్య గత రికార్డులు సమానంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ ఇరు జట్లూ 30 సార్లు తలపడగా.. చెరో 15 మ్యాచ్‌లు గెలిచాయి. కాగా మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న మొహాలీలో మొదట బ్యాటింగ్‌కు దిగిన జట్టే ఈ సీజన్‌లో ఎక్కువసార్లు గెలిచింది.