LSG vs DC: ఐపీఎల్ 2026 సీజన్ 5వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ఏకానా స్టేడియంలో జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 142 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఢిల్లీ జట్టు 4 వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఢిల్లీ విజయంలో సమీర్ రిజ్వీ హీరోగా నిలిచాడు. అజేయంగా 70 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి లక్నో నోటికాడ విజయాన్ని లాగేసుకున్నాడు. ఈ విజయంతో ఢిల్లీ జట్టు 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన ఖాతాను తెరిచింది.
141 పరుగులకే కుప్పకూలిన LSG
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట లక్నో సూపర్ జెయింట్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టుకు ఆరంభం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కేవలం 19 పరుగుల వద్ద కెప్టెన్ రిషబ్ పంత్ (7 పరుగులు) రనౌట్ రూపంలో దురదృష్టవశాత్తూ మొదటి వికెట్‌గా వెనుదిరిగారు. టాప్ ఆర్డర్‌లో మిచెల్ మార్ష్ మినహా మరెవరూ రాణించలేదు. దీంతో 71 పరుగులకే సగం జట్టు పవిలియన్ చేరింది. మార్ష్ 28 బంతుల్లో 35 పరుగులు చేయగా, అబ్దుల్ సమద్ 25 బంతుల్లో 36 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
Also Read: పశ్చిమాసియాలో యుద్ధం.. మూడు గంటలపాటు ప్రధాని మోదీ కీలక సమావేశం!
మరోవైపు, ఎయిడెన్ మార్‌క్రామ్ (11), ఆయుష్ బదోని (0), నికోలస్ పూరన్ (8) తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. లక్నో జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఫలితంగా లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్లలో లుంగీ ఎంగిడి, టి నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో 3 వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, కెప్టెన్ అక్షర్ పటేల్ 1 వికెట్ సాధించాడు.
