KL Rahul 200th International Match: భారత్, శ్రీలంక మధ్య 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగుతోంది. తొలి వన్డే డ్రా కాగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓడింది. ఈ రెండు మ్యాచ్ ల్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ దారుణంగా కుప్పకూలింది. శ్రీలంక స్పిన్ దళాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రెండు వన్డేల్లో అర్ధ శతకాలతో మెరిపించాడు. దూకుడైన బ్యాటింగ్‍తో టీమిండియాకు అదిరే ఆరంభాలు ఇచ్చాడు. అయితే ఆ తర్వాతి బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ రోజు ఇరు జట్లు చివరి మ్యాచ్ లో తలపడబోతున్నారు.
మూడు వన్డేల సిరీస్ సమం చేయాలంటే భారత జట్టు మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. ఈ మ్యాచ్ కేఎల్ రాహుల్‌కు ప్రతిష్టాత్మకం కానుంది. ఎందుకంటే రాహుల్‌కి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్. అయితే తొలి వన్డేలో 31 పరుగులు చేసినా కీలక సమయంలో చివరి వరకు నిలువలేకపోయాడు. రెండో మ్యాచ్‍లో డకౌటై నిరాశపరిచాడు. గత రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోరు చేయలేకపోయిన రాహుల్.. ఈ మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును ఓటమి నుంచి తప్పించడమే కాకుండా 27 ఏళ్ల సిరీస్ ఓటమి ముప్పు నుంచి తప్పించాలనుకుంటున్నాడు.
మూడు ఫార్మెట్లలో రాణిస్తున్న రాహుల్ 2022 టి20 ప్రపంచ కప్ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. మళ్ళీ గతేడాది జరిగిన ప్రపంచకప్ ద్వారా జట్టులో చేరాడు. ప్రస్తుత వన్డే సిరీస్‌లో రిషబ్ పంత్ కంటే కేఎల్ రాహుల్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మిడిల్ అర్దర్లో రాహుల్ సత్తా చాటగలడు. కీపింగ్ లోనూ తన మార్క్ చూపిస్తాడు. రాహుల్ 50 టెస్టు మ్యాచ్‌ల్లో 2863 పరుగులు, 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేశాడు. 77 వన్డేల్లో 2851 పరుగులు చేయగా అందులో 7 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు నెలకొల్పాడు. 72 టీ20 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీల సాయంతో 2265 పరుగులు చేశాడు.
Also Read: Jagan: సెక్యూరిటీ పునరుద్ధరణపై హైకోర్టులో జగన్ పిటిషన్ వాయిదా