KKR’s Injury: గత సీజన్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR’s Injury) కష్టాలు నానాటికి పెరుగుతున్నాయి. జట్టులోని ముగ్గురు స్టార్ ఆటగాళ్లు గాయపడ్డారు. ఈ ఆటగాళ్ల గాయాలు జట్టులో ఆందోళనను పెంచాయి. ఐపీఎల్‌కు ముందు ఈ ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌తో లేకుంటే కేకేఆర్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.
వెంకటేష్ అయ్యర్ 2021 నుండి కేకేఆర్ తో జతకట్టాడు. గత వేలంలో కేకేఆర్ యాజమాన్యం అతనికి 23.75 కోట్ల భారీ ధరను వెచ్చించింది. లీగ్ చరిత్రలో అతను నాల్గవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ కి కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ గాయపడడం జట్టు కష్టాలను పెంచింది. అయ్యర్ గాయం తర్వాత బ్యాటింగ్ చేయాలనీ ప్రయత్నించినప్పటికీ అతని ఫిట్నెస్ సరిగా లేదని స్పష్టమైంది. దీంతో కేకేఆర్ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురవుతుంది.
కేకేఆర్ రింకు సింగ్ ను మ్యాచ్ విన్నర్ గా భావిస్తుంటుంది. కానీ రింకు ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టి20కి ముందు గాయపడ్డాడు. దీంతో సిరీస్ లో రెండు మ్యాచ్ లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతని గాయంపై తుది నివేదిక వచ్చే వరకు కేకేఆర్ కు ఈ టెన్షన్ తప్పేలా లేదు. వచ్చే సీజన్ కోసం కేకేఆర్ రీటైన్ చేసిన తొలి ఆటగాడు రింకునే కావడం విశేషం.
Also Read: On One Nation One Time: “వన్ నేషన్ – వన్ టైమ్” కు కేద్రం ప్రతిపాదన
దక్షిణాఫ్రికా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నార్సియా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో గాయపడ్డాడు. ఈ లీగ్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ కష్టాలు మరింత పెరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఎన్రిక్ ఎప్పుడు ఫిట్‌గా ఉంటాడనే దానిపై ప్రస్తుతం ఎలాంటి అప్‌డేట్ లేదు. లీగ్ ప్రారంభం నాటికి అతడు ఫిట్‌గా లేకపోతే అది కేకేఆర్ బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బే.