SRH vs KKR: చేజేతులా ఓడిన సన్‌రైజర్స్‌… నాలుగో విజయం అందుకున్న కోల్‌కతా

SRH vs KKR: గెలిచే మ్యాచ్ ఓడిపోవడం ఎలాగో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చూసి నేర్చుకోవచ్చు..ఆరంభంలో తడబడి తర్వాత పుంజుకుని విజయం దిశగా సాగిన సన్‌రైజర్స్ అనూహ్యంగా పరాజయం పాలైంది.

  • Written By:
  • Publish Date - May 4, 2023 / 11:36 PM IST

SRH vs KKR: గెలిచే మ్యాచ్ ఓడిపోవడం ఎలాగో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చూసి నేర్చుకోవచ్చు..ఆరంభంలో తడబడి తర్వాత పుంజుకుని విజయం దిశగా సాగిన సన్‌రైజర్స్ అనూహ్యంగా పరాజయం పాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆరంభం నుంచే తడబడింది. సన్‌రైజర్స్ బౌలర్లు అదరగొట్టడంతో కేవలం 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. గుర్బాజ్ డకౌటవగా.. జాసన్ రాయన్ 20 పరుగులకు ఔటయ్యాడు. ఫామ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఈ దశలో కెప్టెన్ నితీశ్ రాణా, రింకూసింగ్ కోల్‌కతాను ఆదుకున్నారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన వీరిద్దరూ క్రమంగా భారీ షాట్లతో అలరించారు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. నితీశ్ రాణా 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 రన్స్ చేయగా… తర్వాత ఆండ్రూ రస్సెల్, రింకూ సింగ్ ధాటిగా ఆడారు. రస్సెల్ 15 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సర్లతో 24 రన్స్ చేసి ఔటయ్యాడు. చివర్లో కోల్‌కతా వరుస వికెట్లు కోల్పోయింది. నరైన్, శార్థూల్ ఠాకూర్, హర్షిత్ రాణా వరుసగా ఔటయ్యారు. అయితే వికెట్లు పడుతున్నా రింకూ సింగ్ ధాటిగా ఆడడంతో స్కోర్ 170 దాటింది. రింకూసింగ్ 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 46 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. సన్‌ రైజర్స్ బౌలర్లలో మార్కో జెన్సన్ 2 , నటరాజన్ 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ , కార్తీక్ త్యాగి, మార్కండే, మర్క్‌రమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు మెరుపు ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 29 పరుగులే జోడించారు. పవన్ ప్లేలోనే సన్‌రైజర్స్ 3 వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ 18 , అభిషేక్ శర్మ 9, రాహుల్ త్రిపాఠీ 20 పరుగులకు ఔటవడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. హ్యారీ బ్రూక్‌ మరోసారి స్పిన్నర్‌ను ఎదుర్కోలేక డకౌటయ్యాడు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ మర్క్‌రమ్, వికెట్ కీపర్ క్లాసెన్ కీలక పార్టనర్‌షిప్ నెలకొల్పారు.

ఆచితూచి ఆడుతూ రన్‌రేట్ పడిపోకుండా చూశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించారు.వీరి పార్టనర్‌షిప్‌తో సన్‌రైజర్స్ విజయం ఖాయమనిపించింది. క్లాసెన్ 20 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. క్లాసెన్ ఔటైనప్పటకీ.. మర్క్‌రమ్, అబ్దుల్ సమద్ ధాటిగా ఆడడంతో సన్‌రైజర్స్ విజయం కోసం చివరి ఐదు ఓవర్లలో 38 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే కోల్‌కతా బౌలర్లు పుంజుకుని కట్టడి చేయడమే కాదు కీలక వికెట్లు పడగొట్టారు.మర్క్‌రమ్‌, జాన్సెన్‌ వికెట్లను పడగొట్టింది.

చివర్లో మళ్ళీ అబ్దుల్ సమద్ దూకుడుగా ఆడడంతో సన్‌రైజర్స్‌ గెలుపు ఆశలు నిలిచాయి. విజయం కోసం 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసాడు. కేవలం 3 పరుగులే ఇచ్చి కీలకమైన సమద్ వికెట్‌ను పడగొట్టాడు. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 2, శార్థూల్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, రస్సెల్, అంకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది నాలుగో విజయం కాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇది ఆరో ఓటమి. అలాగే సొంతగడ్డపై సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో ఓటమి.

ALso Read: Pakistan: పాకిస్తాన్‌లో ఘోరం.. కాల్పుల్లో 8 మంది టీచర్లు హతం